TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి.. చంద్రబాబు

Published on: Sat May 16, 2026 8:38AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక  శ్రద్ధ వహిస్తున్నామనీ సీఎం చంద్రబాబు అన్నారు.  శుక్రవారం మే 15) తన క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సమావేశమైన ఆయన  వారికి నాలుగో విడతలో   306.61 కోట్ల  రూపాయల పరిహారం, పునరావాస ప్యాకేజీని అందజేశారు.   పలువురు లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో నిర్మించిన ఇళ్ల తాళాలను అందజేశారు.

సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున నిర్వాసితులకు పరిహారం అందించడం సంతోషంగా ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 29,936 మంది నిర్వాసితులకు .2,250 కోట్ల రూపాయలు చెల్లించామన్న ఆయన..  ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు నష్టపోకూడదనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు.   అందుకే ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామనీ,  2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామనీ చంద్రబాబు చెప్పారు. 

గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందనీ, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పిన చంద్రబాబు.. గత పాలకులు కాంట్రాక్టర్లను మార్చి, అధికారులను మార్చి ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  మళ్లీ ప్రాజెక్టును గాడిలో పెట్టామనీ,  నిర్వాసితుల్లో  ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వననీ భరోసా ఇచ్చారు.  సాంకేతికతను ఉపయోగించి గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ ఆదాయం పెంచుతామన్నారు.  

ఈ సమావేశంలో మాట్లాడిన నిర్వాసితులు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యల పరిష్కారమౌతాయన్న నమ్మకం పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారంపై ఆశలు వదులుకున్నామని, వరదల సమయంలో కనీస సహాయం కూడా అందలేదని చెప్పారు ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మిరియాల శిరీషా దేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.