నిన్న పంచెకట్టులో మెరిసిన మోడీ.. నేడు మరో ఊహించని అవతారం!!

 

రాజకీయ నాయకుల్లో ప్రధాని మోడీ రూటే సెపరేట్. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర మాతృ భాషలో ప్రసంగం మొదలుపెడతారు. ఆ రాష్ట్రానికి తగ్గట్టు ఆహార్యాన్ని మారుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగా.. ఒక్కోసారి ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంటారు.

అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మహాబలిపురంలో పర్యటించారు. అది కూడా పంచెకట్టులో. తమిళులు తమిళ బాషా అన్నా, పంచెకట్టు అన్నా చెవి కోసుకుంటారు. అందుకేనేమో మోడీ పంచెకట్టుతో సందడి చేసారు. మరి తమిళులు మోడీ పంచెకట్టుకి ఫిదా అయ్యారో లేదో తెలియదు కానీ.. ఈరోజు మోడీ మరో కొత్త అవతారం ఎత్తారు. 

ఈరోజు ఎర్లీ మార్నింగ్ తమిళనాడులోని మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోడీ.. భుజాన సంచి వేసుకొని, బీచ్ లో చెత్త ఏరుతూ కనిపించారు. మోడీ ప్రధాని అయ్యాక స్వచ్ఛభారత్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ భారత్ పిలుపునివ్వడమే కాదు.. దాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు మోడీ. గతంలో చీపురు పట్టి వీధులు ఊడ్చిన మోడీ.. ఇప్పుడు బీచ్‌లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు.

శనివారం తెల్లవారుజామున మామల్లాపురం బీచ్ కి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మోడీ అక్కడ బీచ్ లో చెత్తాచెదారాన్ని ఏరిపారేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, మద్యం బాటిళ్లను తీసి సంచిలో వేసుకొని భుజాన వేసుకున్నారు. దాదాపు అరగంట పాటు మోడీ బీచ్ లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. జనం సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని.. మనమంతా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత ముఖ్యమంటూ ట్వీట్ చేశారు.

మోడీ చెత్త ఏరివేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని అయ్యుండి చెత్త ఏరివేసి ఆదర్శంగా నిలిచారంటూ కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం కెమెరాలో కనపడాలనే పిచ్చితో క్లీన్ చేసారు, బోలెడంత పబ్లిసిటీ కొట్టేసారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.