చిన్నమ్మపై మోడీకి అంత పగ దేనికీ..?

 

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీలో చీలిక దేశంలో రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. జయ తర్వాత అన్నీ తానే అవ్వాలనుకున్న శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని పెద్ద డ్రామానే నడిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ఎత్తుగడల ముందు చిన్నమ్మ చిత్తయిపోయింది. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ ప్రధాని నరేంద్రమోడీనే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమ్మ ఉన్నన్నీ రోజులూ చిన్నమ్మ తెరచాటు వ్యవహారాలు నడిపారు..ఆ తర్వాత ఆమె అందరికీ అమ్మ కావాలని ఆశ పడింది. సీఎం పీఠం ఎక్కడం అటుంచితే..కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. పార్టీపై చెరగని ముద్ర వేద్దామనుకుని చివరకు ఏ గుర్తూ లేకుండా పోయింది. దీనికి కాలం కలిసి రాలేదు అనేకన్నా..మోడీ లాంటి పొలిటికల్ మాస్టర్ ముందు నిలబడలేకపోయారని చెప్పవచ్చు.

 

జయ మరణం తర్వాత పార్టీని గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటికీ..తదనంతర కాలంలో చిన్నమ్మను సీఎం కాకుండా విజయవంతంగా అడ్డుకున్నారు మోడీ. రెండాకుల పార్టీలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఆయన పన్నీర్‌కు అండగా నిలబడ్డారు. తాను జైలు పాలైనా తన వర్గం చేతిలో అధికారం ఉండాలని శశికళ పథకం వేశారు. అందుకు అనుగుణంగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా మేనల్లుడు దినకరన్‌ను నియమించి ఆర్కేనగర్‌ నుంచి సీఎం కుర్చీపై కూర్చొపెట్టాలనుకున్నారు. ఇక్కడే మోడీ తెలివిగా వ్యవహరించారు. దినకరన్‌ వర్గీయులు, మంత్రులు  ఓట్లర్లకు డబ్బులు పంచుతున్న ఫోటోలను సంపాదించి ఈసీకి ఫిర్యాదు చేయించారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో ఎన్నికల కమిషన్ ఆర్కేనగర్ ఉపఎన్నికను రద్దు చేసింది. ఇక ఇరు వర్గాలు పార్టీ గుర్తు మాదంటే..మాది అని ఎన్నికల కమిషన్ దాకా వెళ్లాయి. చివరకు రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ ఈసీ అధికారులకు రూ.60 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు..దీంతో దినకరన్ తనంతట తనే మోడీకి జుట్టు అందించినట్లైంది. ఇక ప్రధాని తన స్టైల్లో వ్యవహారం నడిపారు. శశికళను, దినకరన్‌లను పార్టీకి దూరంగా ఉంచితే తన వర్గాన్ని పార్టీలో వీలినం చేస్తానని పన్నీర్ బహిరంగంగా ప్రకటించారు.

 

పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని గ్రహించిన అన్నాడీఎంకే సీనియర్ నేతలు రంగంలోకి దిగారు..వీలిన ప్రక్రియపై కమిటీని నియమించారు. అంతేకాకుండా దినకరన్‌ను, శశికళ బంధువర్గాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే శశికళను అనధికారికంగా దూరం పెట్టినట్లే..ఈ పరిణామాలన్నింటి వెనుక సూత్రధారి మోడీయేనని రాజకీయం తెలిసిన వారెవ్వరికైనా అర్థం అవుతుంది. మన్నార్ ‌గుడి మాఫియాను దూరంగా పెట్టి అన్నాడీఎంకేను గుప్పెట్లో పెట్టుకున్నారు ప్రధాని మోడీ. తద్వారా త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ బలం మోడీకి లభించినట్లైంది.