TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో పిన్నెళ్లి ఛాప్టర్ ముగిసినట్లేనా?

Published on: Sun Jun 29, 2025 10:32AM

వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికరంలో ఉన్నన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కలుగులో దూరిన ఎలుకలా మారిపోయారు. కేసుల చట్రంలో ఇరుక్కుని బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. అసలాయన రాజకీయాలలో ఉన్నారా? ఉంటే వైసీపీలోనే ఉన్నారా? అసలెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్రలకు సమాధానం లభించని పరిస్థితి నెలకొంది.  పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ వదిలేసిందన్న చర్చ మాచర్ల నియోజకవర్గంలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా  వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఏమంత క్రియాశీలంగా ఉండటం లేదు.

దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులలో ఉన్న పిన్నెళ్లి పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఒక సారి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఆయనపై ఇంకా పలు కేసులు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు వెనుకాడుతున్నారు.  అసలు జనంలోకి రావడం లేదు. జనం వరకూ ఎందుకు పార్టీ నాయకులు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ జెండా ముట్టుకోవడం లేదు. వైసీపీ తరఫున గళమెత్తడానికి సైతం జంకుతున్న పరిస్థితి.  ఇటీవలి జగన్ పల్నాడు పర్యటనలో కూడా పిన్నెళ్లి జాడ కనిపించలేదు. 

ఇదిలా ఉంటటే జగన్ మాత్రం చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలూ, క్యాడర్ ఇంటింటికీ వెళ్లి మరీ ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఆ ఆదేశాల మేరకు పిన్నెళ్లి పని చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పల్నాడు వైసీపీలో కూడా పిన్నెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పుంజుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. అదే సమయంలో ఆయనను పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తత పరిస్థితుల్లో పిన్నెళ్లి మునుపటిలా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో వైసీపీతో ఆయన రాజకీయ ప్రయాణం దాదాపు ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైళ్లకు వెళ్లేందుకు సద్ధపడాలని, పార్టీ నేతలూ క్యాడర్ అందరూ బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ పిలుపునిచ్చిన తరుణంలో కేసులకు భయపడి బయటకు రావడం మానేసిన పిన్నెళ్లిని పార్టీ పదవి నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.