ఇచట అన్ని భయాలూ చెరపబడును

మీకు బొద్దింకలంటే భయమా? మీ జీవితంలో ఏదన్నా విషాదకరమైన సంఘటన మాటిమాటికీ జ్ఞాపకానికి వస్తూ బాధిస్తోందా? మరేం ఫర్వాలేదు! ఎలాంటి ఫోబియాలనైనా, ఆందోళనలైనా తొలగించే అవకాశం ఉంది అంటోంది విజ్ఞానశాస్త్రం.
ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి

 


ఇప్పటివరకూ... మనలో ఏదన్నా ఫోబియా ఉంటే దానిని నివారించే ప్రక్రియలు చాలా సుదీర్ఘంగా ఉండేవి. ఫోబియా ఉన్న వ్యక్తికి తరచూ కౌన్సిలింగ్‌ ఇవ్వడం, భయం మరీ తీవ్రంగా ఉంటే మందులు వాడటం చేసేవారు. ఇంత చేసినా సదరు వ్యక్తిలో ఏదన్నా వస్తువు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టడం అంత సులువు కాదు. ఇక దగ్గరి బంధువులని కోల్పోవడం, ఘోర ప్రమాదాన్ని ఎదుర్కోవడం వంటి సందర్భాల తరువాత మిగిలే గాయాలని మాన్పడమూ అంత తేలిక కాదు. post-traumatic stress disorder (PTSD)గా చెప్పుకునే ఈ మానసిక సంఘర్షణ వల్ల మనిషి బతికి ఉన్నా కూడా జీవచ్ఛవంలా మిగిలిపోతాడు.

 


జ్ఞాపకాలను నమోదు చేశారు
అంతులేని భయాల బాధకి తగిన నివారణ కోసమని జపాన్‌, ఇంగ్లండ్, అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధనను నిర్వహించారు. రోగికి తెలియకుండానే అతని మెదడులో ఉన్న భయాన్ని చెరిపేసే అవకాశం ఏదన్నా ఉందేమో అని అన్వేషించారు. అందుకోసం వారు ఓ 17మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. ఆ అభ్యర్థులకు ముందుగా కొన్ని రంగుల వస్తువులను చూపించారు. అభ్యర్థులు వేర్వేరు రంగుల్లో ఉన్న వస్తువులను చూస్తున్నప్పుడు, వారి మెదడులో నిక్షిప్తం అవుతున్న జ్ఞాపకాలను fMRI స్కాన్‌ ద్వారా నమోదు చేశారు.

 


భయాలను రేకెత్తించారు
వివిధ రంగుల గురించి అభ్యర్థులకు ఉన్న జ్ఞాపకాలను నమోదు చేసిన తరువాత పరిశోధనలో రెండో దశ మొదలైంది. ఇందులో భాగంగా వారికి మళ్లీ వేర్వేరు రంగులను చూపారు. కాకపోతే ఈసారి వారి కళ్ల ముందుకి కొన్ని రంగు వస్తువులు కనిపించేసరికి ఓ చిన్న షాక్‌ని అందించి భయాన్ని రగిలించారు. ఉదాహరణకు ఎరుపురంగు వస్తువుని చూడగానే అభ్యర్థికి కరెంటు షాక్‌ తగిలిందనుకోండి... సదరు అభ్యర్థిలో ఆ రంగులో ఉన్న వస్తువు పట్ల ఒకరకమైన భయం ఏర్పడిపోయేది.

 

 

అదే భయాన్ని చెరిపివేశారు
ఇది పరిశోధనలోని మూడో అంచె. ఇందులో భాగంగా అభ్యర్థులను ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. కానీ వారి మెదడులో జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ నమోదుచేస్తూనే ఉన్నారు. అభ్యర్థి అలా విశ్రాంతి తీసుకుంటుండగా ఇందాక జరిగిన బాధాకరమైన సంఘటన అప్పుడప్పుడూ మెదడులో సుడులు తిరగడాన్ని గమనించారు. ఆ విషయం అభ్యర్థి గమనించకపోయినా మెదడుకి తగిలించి ఉన్న స్కానింగ్‌ పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు గమనించేవారు.

 

 

అలా షాక్‌ తాలూకు జ్ఞాపకాలు మెదుడులోకి ఉబికి వచ్చిన ప్రతిసారీ, అభ్యర్థికి ఓ మంచి వార్తని చేరవేసేవారు శాస్త్రవేత్తలు. ‘ఈ పరిశోధనలో పాల్గొన్నందుకు మీకు కొంత డబ్బుని ఇస్తున్నామనో, వెళ్లేటప్పుడు ఆ డబ్బుని తీసుకువెళ్లమనో...’ అభ్యర్థులని ఊరించే సందేశాలను అందించేవారు. మెదడులో ఒక బాధ ఉబికివచ్చే సమయంలోనే ఏదో శుభవార్త దానికి అందుతూ ఉండటంతో... నిదానంగా బాధాకరమైన జ్ఞాపకాల తీవ్రత తగ్గిపోవడాన్ని గమనించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి ఎంతటి తీవ్రమైన బాధనైనా తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అనడమే కాదు... జపాన్‌లో అయితే ఈ తరహా చికిత్సను మొదలుపెట్టేశారట కూడా! ఇక మీదట మన దగ్గర కూడా- ‘డాక్టర్‌ నాకు మా ఆయనంటే భయం! కాస్త దానిని తగ్గించరూ...’ అంటూ క్లినిక్‌లకు వెళ్లే రోజులు వచ్చేస్తాయేమో!

 

 

- నిర్జర.