పెంపుడు జంతువులతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

 

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ మానసిక ప్రశాంతతే వేరు! కానీ ఇప్పడు పరిస్థితులు అందుకు అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక పక్క ఇరుకు అపార్టుమెంట్లలో జీవనం, మరోపక్క ఉరుకులపరుగుల జీవితం.... వీటితో పెంపుడు జంతువులకి చోటు లేకుండా పోతోంది. ఇక పెంపుడు జంతువుల మీద ఉండే పరాన్నజీవులు, వాటి ధూళితో నానారకాల ఆరోగ్య సమస్యలూ వస్తాయని వినిపిస్తున్న హెచ్చరికలు సరేసరి! కానీ ఇందుకు విరుద్ధమైన పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది...

 

కెనడాకు చెందిన Anita Kozyrskyj అనే పరిశోధకురాలు తన బృందంతో కలిసి పిల్లల రోగనిరోధకశక్తి మీద పెంపుడు జంతువుల ప్రభావాన్ని అంచనా వేశారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ, ఈ లోకంలోకి వచ్చిన మూడు నెలల వరకూ... వారి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే చాలా ఉపయోగమని గ్రహించారు. ఇలాంటి పిల్లలలో మున్ముందు ఆస్తమా వంటి అలెర్జీ సమస్యలు చాలా తక్కువగా నమోదయ్యాయట.

 

పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే Ruminococcus and Oscillospira అనే రెండు రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు పిల్లలలో పెరగడాన్ని గమనించారు. ఈ రెండు సూక్ష్మజీవులూ కూడా శరీరంలో అలెర్జీలను, ఊబకాయాన్నీ నివారిస్తాయని తేలింది. బహుశా పెంపుడు జంతువుల ఒంటి మీద ఉండే క్రిములని ఎదుర్కొనే సందర్భంలో పిల్లల శరీరం ఇలాంటి సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.

 

పసిపిల్లలు ఈ లోకంలోకి వచ్చాక పెంపుడు జంతువుల ప్రభావం ఉండవచ్చుగాక! కడుపులో ఉండగానే అవి ప్రభావం చూపడం ఏమిటి? అన్న అనుమానం రాకమానదు. ఆ సమయంలో తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రిములు వారి కడుపులో ఉన్న పిల్లలకు కూడా చేరడమే ఇందుకు కారణమని తేల్చారు. సిజేరియన్ ద్వారా బిడ్డ జన్మించినా, పిల్లలకు తల్లిపాలు పట్టకపోయినా కూడా ఈ తరహా రోగనిరోధకశక్తిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.

 

ఇంతకుముందు తరంలో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునేవారు, మట్టిలో దొర్లేవారు, ఏది పడితే అది కడుపు నిండా తినేవారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా... అది ప్రమాదం, ఇది మంచిది కాదు అంటూ నిరంతరం ఏవో ఒక హెచ్చరికలు అడ్డుకొంటూనే ఉన్నాయి. ఫలితం! వారి జీవితం ప్రకృతికి దూరంగా కృత్రిమంగా తయారైపోతోంది. శరీరం తనకు తానుగా రక్షించుకునే శక్తిని కోల్పోతోంది. ఇప్పుడు మళ్లీ ఒకో పరిశోధనా ఆ పాత రోజులే మంచివని గుర్తుచేస్తున్నాయి. కానీ ఈలోగా ఎన్ని విలువైన జీవితాలు వృధాగా మారిపోతున్నాయో కదా!

- నిర్జర.