నాలుగు బేతాళ ప్రశ్నలు
posted on Nov 15, 2013 6:39PM
.jpg)
రెండున్నర నెలలు రోడ్లెక్కి ఉద్యమాలు చేసిన తమకి బోలెడంత రాజకీయ చైతన్యం, పరిజ్ఞానం సంపాదించుకొన్నామని సీమాంధ్ర ప్రజలు ఒకటే విర్ర వీగుతున్నారు. మరి వారికి రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవాలని సీమాంధ్ర నేతలకి కూడా ఒక చిన్న కోరిక కలిగింది. అంతే! వెంటనే మారు వేషాలు వేసుకొని జనాల మధ్య తిరుగుతూ ప్రశ్నలు వేస్తున్నారుట!
మొదటి ప్రశ్న: ఏ రాజకీయ పార్టీ దేనితో కుమ్మక్కయింది?
అని వారికి మొదట ‘కుమ్మక్కు టెస్ట్’ పెట్టారు. కానీ పాపం! ఇన్ని కోట్ల మందిలో ఒక్కరు కూడా దానికి సరయిన సమాధానం చెప్పలేక పోవడంతో దానిని సీబీఐ ఫైలులా పక్కన పడేసి, ఈసారి కొంచెం ఈజీ ప్రశ్నవేసారు.
రెండో ప్రశ్న: సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులలో నిజంగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వారి పేర్లు చెప్పండి?
అని అడిగారు. పాపం పామర జనం, ఒక్కడు నోరు విప్పితే ఒట్టు. మరీ ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతే వీళ్ళు ఈ లోకంలో ఎలా బ్రతికేస్తున్నారో పాపం? అనుకొంటూ ఈసారి రాజకీయ నేతలు ఇంకా ఈజీ కొశ్చన్ అడిగారు ప్రజలని.
మూడో ప్రశ్న: అసలు రాష్ట్ర విభజన ఎందు కోసం చేస్తున్నారు?
‘ఓస్! ఈ మాత్రం రాజకీయ జ్ఞానం కూడా మాకు లేదనేనా మీకు ఇంత అలుసయిపోయాము?’ అంటూ ‘తెలంగాణా ప్రజల అడుగుతున్నారు గనుక చేస్తున్నారని’ టక్కున సమాధానం చెప్పేశారు. ‘మరయితే మిగతా రాష్ట్రాలలో కూడా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అడుగుతున్నారు కదా? మరి వారికెందుకు రాష్ట్రాలను విభజించి ఈయడం లేదు?’ అని నేతలు ఎదురు ప్రశ్న వేసేసారికి జనాలు బిక్క చచ్చిపోయారు.
సరే పాపం! ఎంత వద్దనుకొన్నా వెర్రి జనాలు మళ్ళీ మళ్ళీ మనకే ఓటేసి గెలిపిస్తున్నారు గనుక వాళ్ళని మరీ అంత ఆట పట్టించకూడదని భావించి ఈసారి ఇంకా ఈజీ ప్రశ్నేవేసారు.
నాలుగో ప్రశ్న: అసలయిన గొప్ప సమైక్యవాది ఎవరు? రాష్ట్ర విభజన కోరుతున్నవారు ఎవరు?
దీనికయినా పామర ప్రజలు టక్కున సమాధానం చెపుతారని వారు ఊహించారు. గానీ వాళ్ళు కూడా రాజకీయ నాయకులలాగే ఒకరు ఔనన్నవారిని మరొకరు కాదనడంతో ప్రజలింకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారని వారికి అర్ధమయిపోయింది. అందుకే జనాలు ఈ కన్ఫ్యూజన్ లోంచి బయటపడక మునుపే మధ్యంతర ఎన్నికలు పెట్టేస్తే ఎన్నికల సంఘానికి వెయ్యి నామినేషన్ పార్మ్స్ వేస్తామని అందరూ మొక్కుకొంటున్నట్లు సమాచారం.