వైకాపా ఓటమికి సాక్షి కూడా కారణమేనా?

 

వైకాపా పుంగనూరు యం.యల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, “సాక్షి మీడియా వైకాపా విజయం తధ్యం అన్నట్లు చేసిన ప్రచారం కారణంగానే తమలో అతి విశ్వాసం పెరిగి చివరికి ఓడిపోయామని” చెప్పడం ఆ పార్టీ ఓటమికి గల మరో కొత్త కారణం ఆవిష్కృతమయింది. కొన్ని పత్రికలు, టీవీ చాన్నాళ్ళు తమపై విష ప్రచారం చేస్తూ, తెదేపా గెలుపుకు గట్టిగా కృషి చేశాయని వైకాపా నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు ఆరోపించారు. అయితే ఆయనకు చెందిన సాక్షి మీడియా కూడా వారి పద్దతిలోనే విమర్శలకు చాలా ఘాటుగా ప్రతివిమర్శలు చేస్తూ వైకాపా విజయానికి చాలా కృషి చేసింది. కానీ ఇప్పుడు ఆ ‘సాక్షి’ కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని వైకాపాకు చెందిన పెద్దిరెడ్డి చెప్పడం విశేషం. సాక్షి కధనాలు తామందరినీ గెలుస్తామనే ఒక భ్రమలో ఉంచి తప్పుదారి పట్టించినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

 

సాక్షి పత్రిక వైకాపా గెలుపు కోసం చాలా కష్టపడింది. సీబీఐ కేసులతో జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యి జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని ఒక త్యాగమూర్తిగా, మడమ తిప్పని ఒక గొప్ప సమరయోధుడిగా అభివర్ణిస్తూ చాలా చక్కగా వెనకేసుకు రావడమే కాకుండా, ఆయనను వైకాపా అభిమానులకు చేరువ చేయడానికి విశేష కృషి చేసింది. నిజానికి జగన్ వెనుక ‘సాక్షి’ మీడియా లేకపోయి ఉంటే ఆయన పరిస్థితి, పరపతి వేరే విధంగా ఉండేదేమో? కానీ వైకాపాకు, జగన్మోహన్ రెడ్డికి సాక్షి మీడియా ఒక రక్షణ కవచంగా నిలిచి, తనొక మీడియా సంస్థననే విషయం కూడా మరిచిపోయి అచ్చు ఒక రాజాకీయ నాయకుడిలాగానే, వారి ప్రత్యర్ధులను తన ప్రత్యర్దులుగా భావించి శత్రువులతో, చివరికి సాటి మీడియాతో కూడా అలుపెరగని పోరాటం చేసింది.

 

జగన్, విజయమ్మ, షర్మిల, భారతి మరియు ఆ పార్టీలో ఇతర నేతలు చెప్పిన మాటలు పొల్లుపోకుండా ప్రచురించింది, ప్రసారం చేసింది. వారి ప్రతీ మాటకు, చర్యకు చాలా చక్కటి బాష్యం చెప్పేది. పనిలోపనిగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, ఆయన పరిపాలనను, జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలను ఉద్దరించేందుకే దివి నుండి భువికి దిగివచ్చిన దైవ దూతలన్నంతగా డప్పుకొట్టింది. ఆ తమకంలోనే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకపా తిరుగులేని మెజార్టీతోరాష్ట్రంలో అధికారం లోకి వస్తుందని బల్ల గుద్ది మరీ సాక్షి మీడియా వాదించింది. కానీ ఆ డప్పుకు ఇంకో బలమయిన కారణం కూడా ఉందని చెప్పవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు వినరని, పార్టీలో ఎవరినీ ఏ విషయంలో కూడా సంప్రదించరని, తనకు తోచిందే పార్టీ శిలాశాసనంలా అమలుచేయాలని భావిస్తారని, పార్టీలో తనకు భిన్నంగా ఎవరయినా ఆలోచనలు చేసినా,సలహాలు ఇచ్చినా సహించలేరని, ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు, సబ్బం హరి వంటి అనేక మంది సీనియర్ నేతలు చెప్పారు. అటువంటప్పుడు ‘సాక్షి’ మాత్రం పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఏవిధంగా చేస్తుంది? బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి మాటలకు, ఆలోచనలకు, కోరికలకు సాక్షి అద్దంపట్టాలని చూసింది తప్ప ఆయనకు వాస్తవ పరిస్థితి వివరించి అప్రమత్తం చేసే సాహసం చేయలేకపోయి ఉండవచ్చును. లేకుంటే రాష్ట్రంలో విస్త్రుతమయిన నెట్ వర్క్ ఉన్న సాక్షికి వైకాపాకు వ్యతిరేఖంగా మారుతున్న ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను పసిగట్టలేదని అనుకోలేము.


ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సాక్షిని తన రాజకీయ ఆలోచనలకు, కోరికలకు, వ్యూహాలకు, కార్యక్రమాలకు, పర్యటనలకు సాక్షిగా కాక, ఒక మీడియా సంస్థగా భావించి స్వేచ్చనిచ్చి ఉండి ఉంటే బహుశః సాక్షి తప్పకుండా వాస్తవ పరిస్థితులను, ప్రజలలలో మారుతున్న ఆలోచనా ధోరణిని, ప్రజలపై చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీల ఎన్నికల పొత్తుల ప్రభావం వంటివన్నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్లు వివరించి ఉండేది. కానీ ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్...’అనే పద్ధతిలో కలం కదపవలసి రావడంతో సాక్షి జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ అప్రమత్తం చేసే దైర్యం చేయలేకపోయింది. తన పార్టీ విజయం సాధించడం తధ్యమని అతివిశ్వాసంతో వ్యవహరించబట్టే తమ పార్టీ ఓడిపోయిందని జగన్ స్వయంగా చెప్పారు. అందుకే సాక్షి కూడా ఆయన సారధ్యంలో వైకాపా తిరుగులేని విజయం సాధిస్తుందని బాకా ఊదవలసి వచ్చింది. ఆ బాకా చెవులకింపుగా ఉన్నందున జగన్ దానిని నమ్మారు. కానీ ప్రజలు మాత్రం దానిని నమ్మకపోవడంతోనే చిక్కు వచ్చిపడింది.