కప్పల తక్కెడగా మారిన పెడన నియోజక వర్గం

 

సాదారణంగా కాంగ్రెస్ సంస్కృతికి అలవాటు పడినవారెవరూ కూడా ఇతర పార్టీలలో ఇమడలేరు. ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ వంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్చా స్వాతంత్రాలు, ప్రైవేట్ లిమిటడ్ కంపెనీల వంటి ప్రాంతీయ పార్టీలలో ఉండకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోంచి పిల్ల కాలువలవంటి ప్రాంతీయ పార్టీలలోదూకిన వారు, మళ్ళీ ఏదో ఒకనాడు ఆ కాంగ్రెస్ సముద్రంలోకే కొట్టుకొని వచ్చి పడుతుంటారు.

 

చిరంజీవి మెగాపడవేసుకొని (ప్రజారాజ్యం) వచ్చేసరికి అన్ని పార్టీలలోంచి కప్పలు దూకినట్లు బిలబిలమంటూ చిన్నా పెద్దా అందరూ అందులోకి దూకేసారు. వారిలో పెడన కాంగ్రెస్ శాసన సభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ కూడా ఒకరు. ఆయన మెగా పడవలోకి జంప్ చేసేసరికి, ఆ స్థానంలోకి వైఎస్ ఆశీస్సులతో జోగి రమేష్ వచ్చిపడ్డారు. కానీ, పాపం వేదవ్యాస్ ఎక్కిన మెగా పడవ కూడా తిరిగి తిరిగి మళ్ళీ ఆయనను కాంగ్రెస్ సముద్రంలోకే తెచ్చి వదిలేసింది. దానితో భూమి గుండ్రంగా ఉంటుందని అర్ధం చేసుకొన్న వేదవ్యాస్ ఇక మళ్ళీ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పడవలోంచి వేరే పడవలోకి మారకూడదని కృత నిశ్చయం అయిపోవడమే కాకుండా, వచ్చే ఎన్నికలకోసం ఇప్పటి నుండే పెడన వద్ద లంగరు వేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇక, ఆయన స్థానంలోకి దూకిన జోగి రమేష్ మొన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గట్టిగా పట్టుకు తిరుగుతూ పెడన నియోజక వర్గాన్నిచక్కబెట్టేసుకొంటూ, ఉప్పాల రాంప్రసాద్, వాకా వాసుదేవరావు లిద్దరికీ పొగబెట్టడంతో ఉక్కిరి బిక్కిరయిపోయిన వారిరువురూ ముందూ వెనుకా ఆలోచించకుండా పక్కనే లంగరు వేసి ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పడవలోకి దూకేశారు.

 

కానీ, వారి దురదృష్టం వారిని జోగి రమేష్ రూపంలో ఇంకా వెన్నాడుతోనే ఉంది. నిన్న మొన్నటి వరకు (అమ్మ హస్తం పట్టుకొని, అమ్మమ్మ కలలు కంటున్న) ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం పట్టుకొని నమ్మకంగా తిరిగిన జోగి రమేష్, అకస్మాత్తుగా కిరణ్ పై అపనమ్మకం ప్రకటిస్తూ హస్తం పార్టీకి హ్యాండిచ్చేసి, ఆయన కూడా చంచల్ గూడా జైల్లోకి దూకేశారు. తీరా చూస్తే అక్కడ తన కంటే ముందే దూకినవారు చాలామందే గుంపులు గుంపులుగా కనబడసాగారు. వారిలో ఒక గుంపులో ఉప్పాల రాంప్రసాద్, మరో గుంపులో వాకా వాసుదేవరావు కనబడ్డారాయనకి. అదేవిధంగా వారిరువురూ కూడా ఆయనను చూసి ‘రామేశ్వరం వెళ్ళినా..’.అన్నట్లు ఏమిచేయాలో అర్ధం కాక తలలు పట్టుకొన్నారు.

 

కానీ, పక్క నున్న కాంగ్రెస్ పడవలోంచి వేదవ్యాస్ ‘స్వంత పడవలోకి అందరికీ స్వాగతం! సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీ బ్యానర్ పెట్టి పిలుస్తుంటే, జగన్ పడవలోంచి మళ్ళీ వారు కాంగ్రెస్ పడవలోకి దూకేందుకు సర్దుకొంటున్నట్లు సమాచారం. కానీ, ‘అదేమి ఆషామాషీ పడవకాదని అదొక పెద్ద టైటానిక్ షిప్పని దానిని కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి నడుపుతుంటే, బొత్ససత్యనారాయణ అనే పెద్దాయన గంట కొడుతున్నారని, అందులో ఎక్కితే ప్రమాదం’ అని వారిరువురిని వైయస్సార్ పార్టీలోవారి కో-బ్రదర్స్ హెచ్చరిస్తున్నారు. మరి వారిరువురూ టైటానిక్ షిప్ ఎక్కుతారో లేదో చూడాలి.