బహుమతి


కవిత అనే పాపకి ముత్యాల హారం వేసుకోవాలని తెగ కోరికగా ఉండేది. కానీ వాళ్లదేమో చాలా సాధారణ కుటుంబమయ్యే! తల్లీదండ్రీ ఇద్దరూ కూడా రోజూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఒక రోజు కవిత తన తల్లితో కలసి సరుకులు కొనడానికని బజారుకి వెళ్లింది. అక్కడ ఓ దుకాణంలోని అద్దాలలోంచి ఒక ముత్యాల హారం మెరుస్తూ కవితకి కనిపించింది. దాని కింద 300/- అన్న వెల కూడా రాసి ఉంది. ‘అమ్మా! నువ్వెలాగూ మంచి ముత్యాల హారాన్ని కొనలేవు. కనీసం ఈ నకిలీ హారాన్నైనా కొనిపెట్టు ప్లీజ్‌!’ అంటూ అడిగింది కవిత.

 

కవిత వాళ్లమ్మ కాసేపు ఆలోచించింది. తన కూతురికి ముత్యాల హారం వేసుకోవాలని ఎంత ముచ్చటో ఆమెకు తెలుసు. అందుకని చివరికి- ‘సరే! ఈ నెలంతా కనుక నువ్వు బుద్ధిగా ఉంటే, నాకు ఇంటిపనుల్లో సాయపడితే... వచ్చే నెలలో ఉన్న నీ పుట్టినరోజుకి ఆ హారాన్ని కొనిపెడతాను,’ అంటూ మాట ఇచ్చింది అమ్మ. కవిత మామూలుగానే బుద్ధిగా ఉండే పిల్ల. ఇక తల్లి మాట విన్నాక మరింత ఒద్దికగా తన పనులను చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనుల్లో తల్లికి వీలైనంత సాయమూ చేసింది. అలా నెల గడిచేసరికి కవిత పుట్టినరోజు రానేవచ్చింది. తల్లి ఆమెకు మాట ఇచ్చినట్లుగానే, ఆ ముత్యాల హారాన్ని కొనిచ్చింది. ఆ రోజు నుంచి కవిత ఆ ముత్యాలహారాన్ని వదిలిపెట్టలేదు. నిరంతరం ఆ హారం ఆమె మెడలో ఉండాల్సిందే! పడుకునేటప్పుడు కూడా ఆ హారం ఆమె మెడలో లేకపోతే నిద్రపట్టేది కాదు.

 

రోజులు గడిచేకొద్దీ, ఆ హారం వెలిసిపోవడం మొదలుపెట్టింది. కానీ కవితకు మాత్రం దాని మీద మోజు ఏమాత్రం తగ్గలేదు. కవిత వాళ్ల నాన్న ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రోజు కవిత దగ్గరకు వెళ్లి- ‘చిట్టి తల్లీ! నీ మెడలోని ఆ హారం బాగా వెలిసిపోయింది కదా! దాన్ని అవతల పడేయరాదూ. నిదానంగా ఇంకొకటి కొనుక్కోవచ్చు,’ అని అడిగాడు. ‘లేదు నాన్నా! నాకు ఈ హారాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. నా దగ్గర ఉన్న ఏ వస్తువునైనా వదులుకోవడానికి సిద్ధపడతాను కానీ ఈ హారాన్ని మాత్రం వదులుకోలేను. ఇది విరిగి ముక్కలయ్యే దాకా నా దగ్గర ఉండాల్సిందే!’ అని తెగేసి చెప్పింది పిల్ల.

 

‘చిట్టి తల్లీ అలా వెలిసిపోయిన హారం నీ మెడలో ఉంటే చూడటానికి బాగోలేదు. పైగా నీ ఒంటికి కూడా అంత మంచిది కాదు. కావాలంటే ఆ హారాన్ని నా దగ్గర భద్రంగా ఉంచుకుంటాను. దాన్ని నాకు ఇచ్చేయవూ...’ అని అడిగాడు తండ్రి. తండ్రి ఆ హారాన్ని తనకు ఇవ్వమని అడగగానే కవిత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన మెడలోని హారాన్ని తీసుకుని ఆయన చేతిలో పెట్టేసింది. కవిత ఆ పాత హారాన్ని ఇలా పెట్టిందో లేదో, ఆమె తండ్రి తన జేబులోంచి నిదానంగా ఒక కొత్త ముత్యాల హారాన్ని బయటకు తీశాడు. ‘ఇది నకిలీది కాదు. నిజమైన ముత్యాలతో చేసిన హారం! ఇది ఎప్పటికీ మాసిపోదు,’ అంటూ తన కూతురు మెడలో వేశాడు. 

 

జీవితంలో కోరికలు సహజమే! కానీ ఆ కోరికలకు పట్టువిడుపులు ఉండాలి. అప్పుడే ఒకదాన్ని మించి ఒకటిగా ఉన్నతమైనవి పొందగలుగుతాము.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


 

...Nirjara