TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర విభజన జరగదు: బొత్ససత్యనారాయణ

Published on: Fri Nov 29, 2013 8:07PM

 

పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి తిరుగు ఉండదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసేందుకే గట్టిగా కృషిచేస్తోందని ఆయన అన్నారు. ఈ పాపంలో రాష్ట్రంలో ఒక్క సీపీయంకి తప్ప అన్ని పార్టీలకు భాగం ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరుగకపోవచ్చునని అన్నారు.

 

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్న వారిలో తాను ప్రధముడినని, అందువల్ల శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చినప్పుడు దానిని తనతో సహా ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు అందరూ వ్యతిరేఖిస్తామని స్పష్టంగా చెప్పారు. అయితే ఇది కేవలం తమ ప్రజల మనోభావాలను ప్రతిబింబించడమే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించడం కాదని ఆయన అన్నారు.

 

రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఆ పేరుతో పార్టీని కించపరిచేలా మాట్లాడటం రెండు వేర్వేరని అన్నారు. పార్టీలో కొందరు నేతలు వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొని ఈ సాకుతో పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై తాను క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. పార్టీలో అందరిదీ ఒక దారయితే లగడపాటిది వేరే దారని విమర్శించారు.

 

రాష్ట్ర విభజన జరిగినా జరుగకపోయినా తను వచ్చే ఎన్నికలలో గెలవడం నూటికి 200 శాతం ఖాయమని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణాలో కొంత బలపడిందని, కానీ సీమాంధ్రలో మాత్రం ఎదురీత తప్పకపోవచ్చునని, అయినా పార్టీని గెలిపించుకోనేందుకు తన శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని రాసిపెట్టి ఉంటే ఎప్పటికయినా తప్పకుండా అవుతానని, అయితే అంతకంటే ప్రజాభిమానం ఉంటే తాను చాల సంతోషిస్తానని అన్నారు. పదవులపై తనకు ఎటువంటి వ్యామోహం లేదని, కేవలం అధిష్టానం ఆదేశాల మేరకే జోడు పదవులలో కొనసాగుతున్నానని చెప్పారు.

 

విజయనగరంలో జిల్లాలో తన కుటుంబ ఆధిపత్యం పెరిగిపోతునందునే, అది భరించలేని ప్రజలు ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై దాడులకు పాల్పడ్డారా? అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, తను రాజకీయ పనుల కారణంగా రెండు, మూడు నెలలు జిల్లాకు వెళ్లకపోవడంతో ప్రజలలో అపోహలు కలిగి ఉండవచ్చని అన్నారు. ఫేస్ బుక్కులో మెసేజులు ద్వారా తనపై దుష్ప్రచారం సాగినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే తను పూర్తి సమైక్యవాదినని, పదవులకోసం తానెన్నడూ ఆశపడలేదని అన్నారు.

 

పీసీసీ అధ్యక్షుడిగా భాద్యతలు చెప్పటిన కొత్తలో పార్టీని బలోపేతం చేసేందుకు కొంత కృషి చేసినా, తదనంతర రాజకీయాల పరిణామాల వలన నిమిత్త మాత్రుడిగా మిగిలిపోయానని అన్నారు.

 

అనుమతులు లేకుండా తిరుగుతున్న ప్రవేట్ బస్సులను పట్టుకొనేందుకు రవాణాశాఖా మంత్రిగా తనే ఆదేశించానని, ఈ ప్రక్రియ ఇక నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, రెండవసారి కూడా అనుమతి లేకుండా తిరుగుతూ పట్టుబడిన బస్సుల లైసెన్సులు రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తాను చాలా కృషి చేసానని, అయితే రాష్ట్రంలో నిరంతరంగా సాగిన ఉద్యమాల కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బతిందని తెలిపారు. అయినప్పటికీ దానిని కాపాడుకొనేందుకు శాయాశక్తుల కృషిచేస్తున్నాని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితికి అనేక కారణాలున్నాయని ఆన్నారు.

 

ఆయన కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లుగానే, తన తరువాత కూడా అనేకమంది పీసీసీ అధ్యక్షులు ఈ సమైక్యరాష్ట్రంలో ఉంటారని, ఉండాలని తను కోరుకొంటున్నట్లు తెలిపారు.