జనసేన 'జన తరంగం'

 

జనసేన పార్టీ బుధవారం నుంచి ఐదురోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ లో 'జన తరంగం' కార్యక్రమం చేపట్టనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వివరాలు వెల్లడించారు. ‘‘అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు. బుధవారం ఉదయం 11గంటలకు సింగనమల నియోజకవర్గం నుంచి జనసేన ‘జన తరంగం’ కార్యక్రమం ప్రారంభిస్తోంది. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం. నూతన రాజకీయాలకు ఇదో సరికొత్త మార్గం. జనసేన సైనికులు, యువత పార్టీ మేనిఫెస్టోను తీసుకుని ప్రతి ఇంటి తలుపు తట్టండి. జనసేన కార్యక్రమాలను వివరించండి. కులాలు, మతాలకు అతీతంగా జనసేన తెస్తున్న సరికొత్త రాజకీయాలను వివరించండి. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతిక సంవత్సరాల భవిష్యత్‌ను ఇవ్వడానికి జనసేన ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టండి. నేను కూడా పలువురు కుటుంబ సభ్యులతో మాట్లాడతా. ఐదురోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి. జనసేన ఆశయాలు, మేనిఫెస్టో, రాజకీయాలు ఎందుకు మారాలి? వంటి అంశాలను వివరించండి. ప్రజలను మమేకం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా విజయవంతం చేయండి. మీకు అండంగా ఉంటాం. బంగారు ఆంధ్రప్రదేశ్‌, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే దీనికి వెనుక ముఖ్య ఉద్దేశం.’’ అని ఫేస్‌బుక్‌లో పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు.