ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెంచిన విజయం: పవన్ కళ్యాణ్

 

 

 

సీమాంధ్రలో బీజేపీ, టీడీపీ కూటమి, దేశంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను దోచుకున్న విధానం, తెలంగాణను విచ్ఛిన్నం చేసిన విధానం తాను ‘కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో’ నినాదం ఇవ్వడానికి కారణమైందని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓట్లు చీలకూడదని, టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలన్న ఉద్దేశంతోనే తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయాలేదని, ఆ నిర్ణయం కారణంగా ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నరేంద్ర మోడీకి, చంద్రబాబుకి, తెలంగాణలో గెలిచిన కేసీఆర్‌కి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తనకు ఏ రాజకీయ నాయకుడిమీదా వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దోపిడీ దారులు గెలవకూడదని ప్రజలు ఈ ఎన్నికలలో తీర్పు ఇచ్చారని, తనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పెంచిన విజయమిదని పవన్ కళ్యాణ్ అన్నారు.