జనసేన పార్టీకి జగన్ గుర్తింపు అవసరంలేదు

 

అనంతపురం జిల్లాలో ‘జన తరంగం’ పేరిట ఐదు రోజుల పాటు పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ కి కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదని.. జగన్ గుర్తించనంత మాత్రాన గుర్తింపు లేనట్టు కాదన్నారు. ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతులో పాల్గొన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనేసిందని జగన్‌ అసెంబ్లీకి వెళ్లటం మానేస్తారా? ఇదేనా మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడం కూడా చాలా నీచమైన పని అని మండిపడ్డారు. తప్పు చేశారు అని జగన్ ప్రజా సమస్యలను వదిలేసి రోడ్ల మీద తిరగటం చాలా తప్పు అని హితవు పలికారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే సత్తా జనసేనకు ఉంటుంది, అది వైసీపీ వారికి లేదని ఎద్దేవా చేశారు.

అదేవిధంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంపై పవన్ స్పందించారు. నన్ను అన్ని జిల్లాల నుంచి పోటీ చేయాల్సిందిగా అడుగుతున్నారు. కానీ, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే అంశంపై జనవరి లేదా ఫిబ్రవరిలోగా తెలియజేస్తానని పవన్ స్పష్టం చేసారు.