పవన్ కళ్యాణ్ కూడా దేశద్రోహేనా..?

 

నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదా పై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పీ చౌదరి.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ప్రజలతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ కూడా స్పందిస్తూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందే అంటూ, మోదీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలంటూ వ్యాఖ్యానించారు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ యువ‌మోర్చా స్పందించి.. శివాజీపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ‘దేశం నుంచి ఏపీని విడ‌గొట్టాల‌న్న శివాజీపై కేసు న‌మోదు చేయాలి’ శివాజీపై దేశ ద్రోహం కేసుపెట్టాల‌ని పేర్కొంది.  

 

అయితే ఇప్పుడు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు శివాజీ స్పందిస్తూ.. ‘ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులేనా? ఈ రోజున పవన్ కల్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు.. ఆయన కూడా దేశద్రోహేనా?’ అంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ స్పందించడం చాలా సంతోషించదగ్గ విషయమని..  ప్రత్యేక హోదాపై పవన్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు.