ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ట్వీట్ మెసేజ్

 

రాహుల్ గాంధీ విమర్శించేవరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని వైకాపా ఈరోజు దాని కోసం రాష్ట్ర బంద్ నిర్వహిస్తోంది. ఇటువంటి సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ప్రత్యేక హోదా అంశంపై మళ్ళీ స్పందించారు.

 

“గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకి తగిలిన గాయాల్ని గతంలో వివరించాను. ఆయన అర్ధం చేసుకొన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొంటుందనే భావిస్తున్నాను...ఇప్పటికే ఆలశ్యమైందని తెలుసు, కానీ దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకొని భావోద్వేగాలకు పోకుండా ఇంకొంతకాలం వేచి చూద్దాం. అప్పటికీ న్యాయం జరుగని పక్షంలో దానిని ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దాం,” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.

 

ప్రత్యేక హోదా కోసం వైకాపా ఉద్యమిస్తుంటే, “పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు వేచి చూద్దాం, మోడీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొంటుందని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు అందరూ వైకాపా నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కి దూరంగా ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్ కి మద్దతు తెలుపలేదు కనుక కాంగ్రెస్ కార్యకర్తలు, మెగాభిమానులు కూడా దూరంగా ఉంటారు. తన బంద్ ని వ్యతిరేకించినవారు అందరూ చరిత్రహీనులు అవుతారని జగన్ శాపాలు పెడుతున్నారు. కనుక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఘాటుగా స్పందించడం ఖాయం.