పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీటేసాడోచ్...

 

అప్పుడెప్పుడో తుళ్ళూరు వచ్చి చాలా హడావుడి చేసిన వెళ్ళిపోయిన జనసేన అధ్యక్షుడు మళ్ళీ ఇప్పటివరకు జనాలకు మొహం చూపించనేలేదు. పోనీ అప్పుడప్పుడు రెండు ట్వీట్ ముక్కలు పెట్టిన జనాలు సర్దుకుపోయేవారు. కానీ ఆయనకి ఆ మాత్రం ఓపిక, సమయం కూడా లేకపోవడంతో సినిమాల్లో హీరోగా చేసే పెద్దమనిషి రాజకీయాలలో గెస్ట్ ఆర్టిస్ట్ లాగ వచ్చిపోతున్నాడని జనాలు ప్రేమగా తిట్టుకొంటున్నారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన జనాలకి ఓ మూడు ట్వీట్ ముక్కలు పంచిపెట్టి సర్దుకుపొమ్మన్నారు.

 

ఈసారి ఆయన ఏమన్నారంటే “ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రాజకీయాలని భావించే మన నాయకులాగే ఆనాడు నెల్సన్ మండేలా ఆలోచించి ఉండి ఉంటే, దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల పట్ల తీవ్ర వివక్షత చూపిన తెల్లజాతీయులతో ఆయన ఏవిధంగా వ్యవహరించి ఉండాలి? కానీ ఆయన చాలా సంయమనం పాటిస్తూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాల ప్రజల మధ్య యుద్ధాలు జరుగకుండా నివారించగలిగారు. అటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ఆ మహనీయుని మార్గంలో మన నేతలు కూడా పయనించాలి. తెగే దాక ఏదీ లాగొద్దు అంటారు. అయినా పట్టించుకోకుండా ముందుకు సాగితే వారికి అధికారం కట్టబెట్టిన ప్రజలే ముందుగా నష్టపోతారని గ్రహించాలి.”

 

ఎన్నికల ప్రచార సమయంలో చాలా నిర్భయంగా సినిమాలలో లాగే మంచి పదునయిన పంచ్ డైలాగులు పలికి ‘మనోడికి బొత్తిగా భయమన్నదే లేదు...సోనియా, రాహుల్, కేసీఆర్, కవిత, జగన్ అంతటి వాళ్ళని పట్టుకొని కడిగిపారేశాడు మనోడు...మనోడు ఎవరికీ భయపడేటోడు కాడ్రోరే...” అని అభిమాన జనాలు తెగ ముచ్చటపడిపోయారు. అసలు సినిమాలలో కంటే రాజకీయాలలో ఆయనేసిన పంచ్ డైలాగులే భలే పేలాయి..జనాలకి కూడా యమాగా నచ్చేసాయి.

 

కానీ ఏడాది తిరిగేసరికి కర్ర విరగకుండా పాము చావకుండా ఆయన చెపుతున్న ఈ డైలాగులను చూసి అవురా...ఇంతలోనే ఎంత మార్పు? అని ముక్కున వేలేసుకొంటున్నారు. ‘తెగే దాక తాడు లాగొద్దు’ అన్నాడే గానీ లాగొద్దని ఎవరికి చెపుతున్నాడో కూడా చెప్పలేదు. కనుక ఆ ఆప్షన్ అభిమానులకే వదిలి పెట్టేసాడు. ఆంధ్రాలో అభిమానులు కేసీఆర్ కి చెపుతున్నాడని సరిపెట్టుకోవచ్చును...అలాగే తెలంగాణాలో అభిమానులు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నాడని సరిపెట్టుకోవచ్చును. కాకపోతే ఇద్దరినీ అన్నాడని చెప్పుకొనే ఆప్షన్ కూడా ఇచ్చేడు. మళ్ళీ ఎప్పుడు ట్వీట్స్ పంచిపెడతాడో ఏమో...