TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ నలుగురిలో నేను లేను : అల్లు అరవింద్

Published on: Sun May 25, 2025 6:31PM

 

తెలుగు ఇండస్ట్రీలో ఆ నాలుగురు ఆ నాలుగురు అంటున్నారు. కానీ ఆ నలుగురిలో లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి... కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందినవాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని... అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. "మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు... మరి ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. 

ఇలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలనేది చర్చించాలి కదా! నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి" అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. 

రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే, సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ 'నలుగురు' కాస్తా ఇప్పుడు 10 మంది అయ్యారు... వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరుతున్నా అని విలేకరులతో అన్నారు. తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నానని, తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజులో లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1,500 థియేటర్లు ఉంటే, అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని అన్నారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు.