TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇది పైరసీ వ్యవహారం కాదు, కుట్ర: పవన్ కళ్యాణ్

Published on: Tue Oct 15, 2013 9:22AM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ఒక్క రోజు ముందుగా ‘యూ ట్యూబ్’ లోకి అప్ లోడ్ చేయబడింది. అంతే గాక, సినిమా సీడీలు కూడా కృష్ణ జిల్లా పెడన మార్కెట్లోకి కూడా వచ్చేసాయి. పోలీసులతో కలిసి పవన్ అభిమానులు ఆ సీడీలను మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకోన్నపటికీ, అప్పటికే ఇంటర్నెట్ లోకి కూడా అప్ లోడ్ అయిపోవడంతో, అది శరవేగంగా ప్రపంచంలో నలుమూలలకి చేరిపోయింది. దాదాపు మొత్తం సినిమా అంతా విడుదలకు ముందే వేలాది మంది చూసేయడమే గాక, దానిని తమ స్నేహితులతో, బంధువులతో కూడా పంచుకొన్నారు. ఆ సినిమా నెట్లో మరింత విస్తరించకుండా ఉండేందుకు పోలీసులు చాలా చర్యలు తీసుకోన్నపటికీ, అప్పటికే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక ఆ సినిమా భారీగా నష్టపోవడం ఖాయమని అందరూ భావించారు.

 

కానీ పవన్ కళ్యాణ్ కి ప్రజలలో ఉన్నప్రత్యేక ఆదరాభిమానాల వల్ల ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్ హిట్ అవడమే గాక కలక్షన్స్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరబాదులో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఇది పైరసీ వ్యవహారం కాదు. సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తులు చేసిన కుట్ర. వారు సినిమా విడుదలకు రెండు నెలలు ముందు నుండే కాపీలను సిద్దం చేసి పెట్టుకొని, సినిమాను దెబ్బ తీయాలనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కాపీలను సరిగ్గా సినిమా విడుదలకు ముందు, ఇంటర్నెట్లోకి అప్ లోడ్ చేసారు. అదేవిధంగా మార్కెట్లోకి కూడా కాపీలను రిలీజ్ చేశారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా కొందరు చేసిన కుట్ర అని నాకు తెలుసు. దీని వెనుక ఎవరెవరున్నారో, వారి పేర్లతో సహా నేను చెప్పగలను. సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు, సినిమా రిలీజ్ కి చాలా రోజుల ముందు నుండే, నా సినిమా చాలా బాగుందని నన్ను అభినందిస్తున్నారంటే, ఆ కాపీలు ఎంత మంది షేర్ చేసుకొన్నారో అర్ధం అవుతోంది. ఒకరిద్దరయితే వారిని తప్పకుండా నిలదీసేవాడిని. కానీ ఇది తప్పని తెలిసినా కూడా అనేకమంది దానిని చూసి నన్నుఅభినందిస్తుంటే ఎందరిని నిలదీయగలము? కొందరు వ్యక్తులు సినీపరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారు. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తాట తీస్తాము. ఈ కుట్రకి పాల్పడిన వ్యక్తులు ఎంత పెద్దవారయినా వదిలిపెట్టేది లేదు,” అని హెచ్చరించారు.