ఈ టికెట్స్ చాలా ఖరీదు గురూ!

 

మన దేశంలో జరిగే ఏ ఎన్నికలలోనయినా రాజకీయపార్టీలు, నేతలు డబ్బు విరజిమ్మడం మనకి కొత్తేమి కాదు. ఒకప్పుడు సామాన్యులు సైతం ఎన్నికలలో పోటీ చేయగలిగే పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమంగా అది కేవలం ధనికులకు మాత్రమే పరిమితమయిన వ్యవహారంగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ప్రజలని, ముఖ్యంగా యువతని రాజకీయాలోకి రావాలని పిలుపు ఇస్తుంటాయి. కానీ, వారిని కేవలం 2వ, 3వ స్థాయి కార్యకర్తలుగా వాడుకోవడానికి మాత్రమే పిలుస్తాయని చాలా మంది గ్రహించరు.

 

వివిధ వ్యాపారాలలో బాగా డబ్బు సంపాదించిన తరువాత దానిని కాపాడుకోవడానికో లేక సమాజంలో హోదా కోసమో రాజకీయాలలో ప్రవేశించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలకు నేడు మన రాజకీయ పార్టీలు ప్రాదాన్యత ఇస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల తేదేపాకు రాజీనామా చేసి తెరాసా వైపు చూస్తున్న కడియం శ్రీహరి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

 

అయితే ఆయన ఇప్పుడు చేరాలనుకొంటున్న తెరాస లోను ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొని ఉందనే సంగతిని స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో విస్పష్టంగా ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో గెలుపు చాలా ముఖ్యం గనుక కేవలం డబ్బు ఖర్చుపెట్టగలవారు మాత్రమే పార్టీ టికెట్స్ గురించి మాట్లాడండి," అని అన్నారు.

 

డబ్బుకి అధికారానికి మద్య ఏర్పడిన ఈ లంకెను బహుశః ఏ రాజకీయ పార్టీ (ఒక్క లోక్ సత్తా తప్ప) తెంచదలచుకోలేదు. ఎందుకంటే, ఈ పద్దతిలో పోటీలో ఉన్నవారిని వడపోసి, మిగిలిన వారిని పార్టీకి సోపానాలుగా వాడుకోవడాని వీలుపడుతుంది.

 

ఇక, దీనివల్ల మనం తెలుసు కోగలిగే మరో చేదు నిజం ఏమిటంటే ప్రజాస్వామ్యం పేరిట అధికారం కోసం జరిగే ఈ పోటీలో పార్టీలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు, నీతి నియమాలు, ఆదర్శాలు అన్ని ఎందుకు పనికిరానివిగా మిగిలిపోతే, డబ్బు, పలుకుబడి, పరిచయాలు, కులం అనేవి మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. రాజకీయ పార్టీలలో కనబడుతున్న ఈ ‘డబ్బు స్పృహ’ తో ధనికులు ఏ పార్టీ టికెట్ అయినా సినిమా టికెట్ కొనుకోన్నంత తేలికగా కొనుకోగలరన్నమాట.

 

ఇటువంటి ధనికులను పార్టీలు తమ ప్రతినిధులుగా నిలబెడితే వారికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు కులాల, మతాల, ప్రాంతాల కళ్ళద్దాలు ధరించి క్యులలోనిలబడి మరీ వారికి ఓటేసి వచ్చి తమ కులపోడికి ఓటేసి వచ్చి ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో ఉడతా భక్తిగా తమ వంతు పాత్ర పోషించామని సంతృప్తి పడుతుంటారు.

 

ఇక రాజకీయ పార్టీలు కూడా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారికి తమ పార్టీ తగిన ప్రాదాన్యత ఇస్తుందని బల్ల గుద్ది చెప్పడమే కాదు దానిని ఎంతో నిబద్దతగా పాటిస్తాయి. అయితే, సదరు వ్యక్తికి ముందే చెప్పుకొన్న ప్రాదమిక అర్హత (డబ్బు) తప్పనిసరి. వందల కోట్లు పోగేసుకొన్న ఒక యస్సీ లేదా ఎస్టీ వ్యక్తికి లేదా మతస్తుడికో పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా సదరు కులానికి, మతానికి న్యాయం చేసినట్లేనని అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో సిద్దంతీకరించేసాయి.

 

అందువలన, నేడు డబ్బు లేని వాళ్ళు రాజకీయాలకి అనర్హులు. డబ్బున్నవాడు ఎన్నికలలో పోటీ చేయాలి. లేని వాడు అతనికి ఓటేయాలి. ఇదే ఇప్పటి సిద్ధాంతం. ఇది తెలిసీ రాజకీయాలలో చేరాలనే దురద భరించలేకపోతే, ముందే అనుకొన్నట్లు సదరు ధనిక అభ్యర్ధిని పల్లకిలో పెట్టి మోయగల కార్యకర్తలుగా చేరేందుకు రాజకీయపార్టీలు ఎప్పుడు తమ తలుపులు తెరిచే ఉంచుతాయి. గనుక నిర్భయంగా వెళ్లి జేరిపోవచ్చును.ఈ పద్ధతికే మనం ముద్దుగా ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొన్నాము.