TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరకాల బరిలో కాకతీయ విద్యార్థి సంఘం?

Published on: Wed May 9, 2012 10:16AM

వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు తెలంగాణా వాదుల మధ్య విభేదాలకు కారణమైంది. ఇక్కడ పోటీకి బిజెపి, తెలంగాణా టిడిపి, టి.ఆర్.ఎస్. లు తమ అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నాయి. అయితే దీని వల్ల తెలంగాణావాదంలో చీలిక వచ్చి బలహీనపడే ప్రమాదం ఉందని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని పొలిటికల్ జెఎసి నిర్ణయించిన అభ్యర్థికే మిగిలిన అన్ని రాజకీయపార్టీలు మద్దతు పలకాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిని బలపర్చకపోతే తామే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాల్సివస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

 

కాకతీయ విద్యార్థుల ప్రకటనలను రాజకీయపార్టీలు సీరియస్ గా తీసుకోకపోవటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంరోజుల్లోగా ఆ పార్టీలు తమ వైఖరి వెల్లడి చేయకపోతే విద్యార్థి యూనియన్ కు చెందిన ఎవరో ఒక విద్యార్థిని పొలిటికల్ జెఎసి మద్దతుతో రంగంలోకి దింపాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జాక్ యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు టిడిపి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి అభ్యర్థి కోసం పట్టుబడుతున్నారు. అయితే దీనికి టి.ఆర్.ఎస్. బిజెపి మద్దతు లభించటం లేదు. దీంతో పరకాల ఉప ఎన్నికల కారణంగా తెలంగాణావాదుల్లో చీలికవచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ లబ్ది పొందే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.