కేంద్రమంత్రి పళ్ళంరాజుపై ఇ.సి. నిషేధం?

 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి పళ్ళంరాజు మీద ఎన్నికల సంఘం నిషేధం విధించాలని కాంగ్రెసేతర పార్టీలు కోరుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన పళ్లంరాజును ఎన్నికలలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కొందరు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అయితే మంగళవారం నాడు పళ్ళంరాజు కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారని, తనకు ఓటేయాలని రోగులు, వైద్యులు, సిబ్బందిని అడిగారని కాంగ్రెసేతర రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలలో పళ్ళంరాజు ఓటమి ఖాయమైందని, అందుకే దింపుడుకళ్ళం ఆశతో ప్రచారం గడువు ముగిసినా ప్రచారం చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. ఇ.సి. ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి, పళ్ళంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారని నిర్ధారణ అయినట్టయితే ఆయన ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.