పాక్ నేర్పుతున్న గుణపాఠం

 

భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి నేటి వరకూ కూడా అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ మనుగడ కోసం భారతదేశాన్ని బూచిగా చూపిస్తూ రోజులు నెట్టుకొచ్చేయి తప్ప భారత్ తో పోటీపడి దేశాన్ని అభివృద్ధి చేసుకొందామనే ఆలోచనా, ప్రయత్నం ఏ నాయకుడూ చేయలేదు. ఆ కారణంగా ఆ దేశంలో నిరుద్యోగం, దారిద్ర్యం, అవినీతి ఇత్యాది సమస్యలన్నీ పెరుగుతూ వచ్చేయి. వాటి నివారణ కోసం ప్రయత్నించవలసిన ప్రభుత్వాలు, వాటి నుండి వారి దృష్టి మరల్చడానికి భారత్ పట్ల ప్రజలలో విద్వేషాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. ఆ ప్రయత్నాలలో నుండే మత ఛాందసవాదం కూడా క్రమంగా బలపడింది.

 

నానాటికీ బలపడుతున్న భారత్ వల్ల పాకిస్తాన్ కు చాల ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావన పాక్ ప్రజలలో పెంచడం ద్వారానే అక్కడి ప్రభుత్వాలు మనుగడ సాగిస్తుంటాయి. అందుకే అక్కడి ప్రభుత్వాలు తమ ప్రజలలో ఆ అభద్రతాభావం పెంచిపోషించేందుకు అప్పుడప్పుడు భారత్ పై దాడులు చేస్తుంటాయి. అందుకోసం ఉగ్రవాదాన్ని కూడా పెంచిపోషించవలసి వచ్చింది.

 

మత ఛాందసవాదులయిన కొందరు అధికార ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు ఆ ఉగ్రవాదానికి ఎప్పటికప్పుడు నారునీరు పోస్తూ బాగా బలపడేందుకు యధాశక్తిగా కృషి చేసారు. జడలు విప్పిన ఆ ఉగ్రభూతమే నేడు అభం శుభం తెలియని 160 విద్యార్ధుల ప్రాణాలను బలిగొంది. అందుకు పాకిస్తాన్ ప్రజలే కాదు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు కూడా చాలా బాధపడుతున్నాయి. విద్వేషాన్ని పెంచి పోషిస్తే దాని దుష్పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్ధం చేసుకోవడానికి ఇదొక సజీవ ఉదారణ.

 

రాష్ట్రాలను దేశాలను ఏలుతున్న ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న రాజకీయ పార్టీలు, వాటిని నడిపిస్తున్న స్వార్ధ రాజకీయ నేతలు ప్రజలలో విద్వేష భావనలు వ్యాపింపజేసి తాము లాభపడవచ్చని ప్రయత్నిస్తే వాటి ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

 

వేల సం.ల చరిత్రకల భారతదేశం ఏనాడూ కూడా ఇతర దేశాల మీద యుద్దాలకు వెళ్ళలేదు. కానీ తమపై దురాక్రమణలు చేసిన వారిని కూడా తనలో ఐక్యం చేసుకోగలిగింది. అందుకే అదొక అద్భుత ప్రపంచంగా అందరినీ ఆకట్టుకొంటోంది. భారత్ అంటే వంద కోట్ల జనాభా మాత్రమే కాదు. అనేక కులాలు, మతాలు, బాషలు, సంస్కృతుల విశిష్ట సమ్మేళనం. యావత్ ప్రపంచం ఒక ఎత్తయితే భారత్ ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పవచ్చును. వంద కోట్ల మంది ప్రజలలో కనిపించే ఆ పరమత సహనం, శాంతి కాముకతే ఇంత కాలం భారత్ కు శ్రీరామరక్షగా కాపాడుతోంది. అందుకే ఇంత సుస్థిరంగా నిలువగలిగింది. అందుకే క్రమంగా అభివృద్ధి చెందగలుగుతోంది.

 

అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా స్వార్ధ పరులయిన కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు తమ మనుగడ కోసం ప్రాంతీయ వాదం, మత తత్వవాదం, కులతత్వం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇటువంటి విద్వేష భావనలు, కుల, మత ఛాందసవాదం, బాషా, ప్రాంతీయవాదం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే వారిని ప్రజలు దూరం పెట్టడం చాలా అవసరం. లేకుంటే ఇటువంటి దుష్పరిమాణాలే ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.