TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆపరేషన్‌ సింధూర్‌ నేపధ్యంలో.. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం

Published on: Wed May 7, 2025 3:39PM

 

పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్‌.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌ మంగళవారం అర్ధరాత్రి పాక్‌ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు. ఆర్మీ ఆపరేషన్ గురించి వివరాలను వెల్లడించినట్లు సమాచారం. ఆపరేషన్ చేపట్టిన తీరు, మన సైన్యం ధైర్య సాహసాలను రాష్ట్రపతికి ప్రధాని వివరించి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలను వివరించనున్నట్లు సమాచారం.

ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ధ్వంసం చేసిన వాటిలో ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలు కూడా ఉన్నాయని తెలిసింది. భారతదేశంపై ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, వాటిని నిర్దేశించడం వంటి కార్యకలాపాలు ఈ కేంద్రాల నుంచే జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే సైన్యం ఈ దాడులు చేపట్టింది. రెండు వారాల క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక నేపాల్ దేశస్థుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగిన అనతికాలంలోనే భారత సాయుధ దళాలు ఈ ప్రతిదాడులకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.