కాపురాన్ని చక్కదిద్దే హార్మోను

ఆక్సిటోసిన్- ఈ పేరు మనకి కొత్త కావచ్చు. కానీ వైద్యులకి కాదు. అప్పుడే పుట్టిన పిల్లవాడి మీద తల్లికి ప్రేమ కలగడం దగ్గర్నుంచీ, టీనేజి కుర్రకారు ప్రేమలో పడటం వరకూ కథంతా నడిపించేది ఈ హార్మోనే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇది లవ్ హార్మోను. కానీ సంసారాన్ని చక్కదిద్దడంలో ఈ హార్మోను ఏమేరకు పనిచేస్తుందో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఫలితం ఇదీ... అమెరికా, నార్వేలకి చెందిన పరిశోధకులు కాపురంలో ఆక్సిటోన్ పాత్ర గురించి గమనించాలనుకున్నారు. ఇందుకోసం వారు అమెరికా, నార్వేలకు చెందిన దాదాపు 300 మందిని పిలిపించారు. వీరందరినీ కూడా ‘ఒక్కసారి మీ భాగస్వామి గురించీ, వారితో మీకున్న అనుబంధం గురించి తల్చుకోండి,’అని వారికి సూచించారు. అలా తల్చుకునే సమయంలో వారిలో ఆక్సిటోసిన్ స్థాయి పెరగడాన్ని గమనించారు. దాంతో ఆక్సిటోసిన్కూ భార్యాభర్తల అనుబంధానికీ మధ్య సంబంధం ఉందని తేలిపోయింది.

 

మనిషన్నాక నానారకాల హార్మోనుల పనిచేస్తుంటాయి. ఒకో సందర్భాన్ని బట్టి ఒకో హార్మోను పనిచేయడంలో ఆశ్చర్యం ఏముంటి? అన్న అభిప్రాయం కలగవచ్చు. కానీ ఆక్సిటోసిన్కి సంబంధించి నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటుంది. బంధం సరిగ్గా లేనప్పుడు ఈ ఆక్సిటోసిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుననట్లు గ్రహించారు. అంటే భార్యాభర్తలలో ఎవరో ఒకరు సంసారం పట్ల చిరాకుగా ఉంటే... ఆ చిరాకుని సరిదిద్ది కాపురాన్ని చక్కబెట్టుకునేలా, అవతలి వ్యక్తిలో ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోందట. దాంతో అవతలి వ్యక్తి అభిప్రాయాలను మరింతగా గౌరవించేందుకు, వారితో మరింత జాగ్రత్తగా మెలిగేందుకు ఆక్సిటోసిన్ ఉపయోగపడుతుంది.

 

భార్యాభర్తలలో ఒకరికి ఆక్సిటోసిన్ తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటే... అవతలి వ్యక్తిలో ఆ కాపురాన్ని చక్కదిద్దుకునేందుకు ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఎక్కువ కావటం ఆశ్చర్యమే! బహుశా ఈ కారణంగానే మొగుడూపెళ్లాల మధ్య చిచ్చు రేగినప్పుడు, ఇద్దరిలో ఎవరో ఒకరు అహాన్ని పక్కనపెట్టి సామరస్యానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా జరగడానికి కూడా ఓ పరిమితి ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక పరిమితి దాటిన తర్వాత ఆక్సిటోసిన్ పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందట. అంటే పట్టువిడుపుల హద్దులు దాటి, తెగేవరకు లాగితే... ఏ హార్మోనూ పనిచేయదన్నమాట. ఆక్సిటోసిన్ ప్రభావం గురించి తెలిసింది కాబట్టి మున్ముందు దీన్ని చికిత్సలా కూడా అందిచే అవకాశం లేకపోలేదు. ‘నాకు ప్రపంచంలో ఎవర్ని చూసినా చిరాగ్గా ఉంటోంది, నా సొంత తమ్ముడినే చంపాలనుంది, మా ఆవిడ ఎంత మంచిదైనా కూడా ఆమెతో కాపురం చేయబుద్ధి కావడం లేదు...’ అంటూ వచ్చే రోగులకి ఆక్సిటోసిన్ మందులు ఇస్తే మనసంతా ప్రేమతో నిండిపోతుందేమో!

- నిర్జర.