నవంబర్ 1న బందర్ పై ఉప్పెన.. సగం జనాభా మృత్యువాత.. అసలేం జరిగిందంటే?

posted on: Nov 1, 2021 12:16PM

నవంబర్ 1 పేరు వింటేనే మచిలిపట్నం ప్రజలు ఉలిక్కిపడతారు. 1864 నవంబర్ 1న బందర్ లో పెను ఉప్పెన స్పష్టించిన ప్రళయం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఆ రోజున మచిలీపట్నంలో 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఘోషించాయి. 157 ఏండ్లు అవుతున్నా అప్పటి బీకర దృశ్యాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి.                    

నౌకా వ్యాపారంలో నాడు  అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు 1864 నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు  సముద్రతీరంలో  భారీ ఇసుకమేటలు వేయడంతో  బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది. తీరం లోతు లేనందున భారీ ఓడల రాకపోకలు మహా కష్టమైంది. నేటికీ ఆ ఇసుకమేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపం అయింది. పరాయి పాలనలో ఒక మెట్రో నగరం మాదిరిగా వెలిగిన బందరు అభివృద్ధి క్రమేపి కుంటుపడింది. 

రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1న బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి ,  780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన తీర ప్రాంతం పై కరాళ నృత్యం చేసింది. ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది. నాడు బందరు పట్టణంలో 65 వేల మంది జనాభా ఉండగా  అందులో  30 వేల మంది తమకేమి జరుగుతుందో తెలిసేలోపు  ఆ కాళరాత్రి  జలసమాధి అయ్యారు. సముద్రం తీరాన్ని దాటి, 17 మైళ్ళు ఊళ్ళపై   చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచివేసింది. నేటి కాలేఖాన్ పేట ప్రాంతంలోని  శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలో 700 మంది ప్రజలు నివసించేవారని ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని చరిత్రలో లిఖితమైంది. . ఇక చింతగుంటపాలెంలో పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయన సముద్ర కెరటాలకు ఎక్కడికో  చాలా దూరం కొట్టుకొనిపోయి ఒక తాటిచెట్టుపై  మొవ్వలో చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చి అతి కష్టం మీద తన స్వస్థలానికి చేరుకున్నాడని నాడు ప్రజలు చెప్పుకొనేవారు.  

బందరులో కోటావారితుళ్ళా సెంటర్  పాత దుర్గామహల్  (ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద) శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ( డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా ఆ పురాతన మేడ  కొనసాగింది. దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఈ భవనానికి కొందరు దుండు నిప్పు పెట్టి తగలబెట్టారు )  ఆ పంతులు గారి మేడలో ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు తల దాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారు. 

నాటి బ్రిటిష్ అధికారి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు ఎంతో చిరస్మరణీయం.  ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు తమ పొలిసు సిబ్బందితో కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న శవాల గుట్టలను ..పశువుల కళేబరాలను ఎక్కడికక్కడే భూమిలో పూడ్చిపెట్టారు...ఎడ్మన్డ్ షార్కి తమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సముద్రంలో మునిగిచనిపోగా.. వారినందరిని  ఆ సమీప ప్రాంతంలో  ఖననం చేశారు. 40 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి గుట్టలు  కనబడేవి.. విషయం తెలియని చాలా మంది ఆ మట్టిని తమ ఇళ్ళను మెరకు చేసుకునేందుకు ఎడ్ల బండ్లలలో ట్రాక్టర్లలో తరలించుకోన్నారు.. ఆ మట్టిని తవ్వే టప్పుడు తమకు మానవ కళేబరం తాలూకా కొన్ని ఎముకలు కూడా దొరికాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు  

ఆనాటి ఘోర దుర్ఘటనలో పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో మానసికంగా చలించిపోయారు. ..ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం శవాహారంకు నాడు అలవాటుపడ్డాయట ...నేడు మాచవరం సమీపంలో 1809 సంవత్సరం నుంచే  ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అక్కడకు వ్యాపించిన సముద్రపు నీరు చర్చి గోడలు ఎనిమిది అడుగుల మేర ప్రవహించిందని నాటి తరం పెద్దలు చెప్పుకొన్నారు.. ఈ చర్చ్ గోడలకు ఇప్పటికీ ఆ ఉప్పునీటి చారిక స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రదేశమతా సున్నం ఎంత పులిమినప్పటికీ ఇప్పటికి ఆ చార స్పష్టంగా కనబడుతూనే ఉంటుందని కొందరు స్థానికులు అంటుంటారు. 

1864 నవంబర్ 1 వ తేదీన సంభవించిన  ఉప్పెన అనంతరం ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. బందరు పరిసర ప్రాంతాలపై సముద్రపు నీరు ప్రవహించిన  కారణంగా వ్యవసాయ భూములు చౌడు బారిపోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పునీరుగా మారిపోయాయి. ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. నాడు మానవత్వం కల్గిన కొందరు వ్యాపారవర్గాలు ప్రజల తాగునీటి అవసరాల కోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్  థారన్ హిల్ కు అందించారు. ఆయన మరో 30 వేల రూపాయలను ప్రభుత్వం నుంచి సమీకరించి నాటి నాగులేరు ( ఇప్పటి ఖాలేఖాన్ పేట  మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ తాగునీటి పైప్ లైన్  నిర్మించారు. అప్పట్లో టౌన్ ప్రజానీకo మొత్తం  తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు సెంటర్ ప్రాంతం.. అంతటి ఘన చరిత్ర గల కోనేరు కూడలి ఇప్పుడు కొందరు మూర్ఖులకు మూత్ర విసర్జన కేంద్రంగా మారింది. 
            ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా పైకం కోసం ధన పిశాచాలుగా మారారు. సముద్రం నీటిలో ఊపిరాడక అర్థంతరంగా చనిపోయిన  మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో నిమగ్నమైయ్యారంట . వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి రహస్యంగా తమ ఇంటి గోడల్లో దాచుకున్నరని ఆ తర్వాత వారే పట్టణంలో అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో వృద్ధతరం వారు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్పుకొన్నారు , అయితే , చనిపోయినవారి శాపం తగిలిన కారణంగానో ఏమో,  బంగారం భారీ ఎత్తున సేకరించు కున్న  ఆ కుటుంబంలో ఒక వింత శాపం మూడు తరాల వరకు కొనసాగిందట.. సంబంధిత వ్యక్తికి భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగులుగా మాదిరిగా లుకలుకలాడుతూ  కనిపించేదని దాంతో ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని ఆహరం తీసుకొనేవారని  చెప్పేవారు. 
ఈ ఉప్పెన అనంతరం ఎందరో బందరును విడిచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై భ్రమలు పూర్తిగా వదులుకొన్నారు. తమ స్థావరాలలో  ప్రాణ ఆస్తి నష్టం అధికం కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు. ఆ  ఉప్పెన అనంతరం బందరు తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం ప్రారంభమైంది..              

ఆనాటి  విషాదం అత్యధికులకు నేటికీ తెలియదు. బందరు వుప్పెన పై అవగాహన ఉన్న ఏ ఒక్కరు గుర్తు చేసుకోకపోవడం విచారకరం.  పరాయి పాలకులైన నాటి ఉప్పెనలో మృతి చెందిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని బందరుకోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ లో ఒక భారీ స్థూపం నిర్మించారు. నేటికీ ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపం గుర్తు చేస్తూనే ఉంటుంది. కనీసం  పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో  లేక  ఒక్క పుష్పగుచ్ఛమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం ఎంత బాధాకరమో కదూ ? 

google-ad-img
    Related Sigment News
    • Loading...