ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

 

ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా 2015సం.కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె వ్రాసిన ‘విముక్త’ కధా సంపుటికి గాను ఈ అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఆమె కలం పేరు ఓల్గా. కానీ ప్రజలకు ఆమె ఓల్గా గానే తెలుసు. ఆమె 1950సం.లో గుంటూరులో జన్మించారు. తెలుగు సాహిత్యం మీద అభిరుచితో ఆమె ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. 1973 నుంచి 86 వరకు తెనాలి వీఎస్‌ఆర్‌-ఎన్‌వీఆర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు.

 

ఆమె స్త్రీవాద రచయితగా అందరికీ సుపరిచితులు. అదే విధంగా స్త్రీల సమస్యలపై పోరాడిన వ్యక్తిగా సుపరిచితురాలు. ఆమె రచించిన ఆకాశంలో సగం, కుటుంబ వ్యవస్థ, విముక్త వంటి కధలు, స్వేచ్ఛ, ఓల్గా వంటి కవితలు అనేక నాటికల ద్వారా తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం, గుర్తింపు సంపాదించుకొన్నారు. ఆమె 1986 నుంచి 95 వరకు సుమారు 15 సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు సాహితీ రంగంలో ఈ అత్యున్నత పురస్కారానికి ఆమె కధా సంపుటి ఎంపిక కావడం తెలుగు సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకమేనని చెప్పవచ్చును.