పెద్దవాళ్లు మీ మాటను ఎందుకు వినలేరు!

కొంతమంది పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు ఎందుకో మన మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అనిపిస్తుంది. ఇంకాస్త గట్టిగా మాట్లాడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగని వారికి ఏమన్నా చెముడు వచ్చిందా అంటే, పరీక్షలలో అంతా బాగానే ఉన్నట్లు తోస్తుంది. దాంతో సమస్య ఎక్కడ ఉందా అని అటు వినేవారూ, ఇటు వాగేవారు కూడా వాపోతుంటారు. ఇన్నాళ్లకి ఆ సమస్యకి తగిన సమాధానం దొరికింది.

 

కథలు వినిపించారు

మేరీలాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు 61-73 ఏళ్లలోపు ఉన్న కొందరు వ్యక్తులను ఎన్నుకొన్నారు. వీరికి ఒకేసారి మూడు కథలను వినిపించారు. వాటిలో కేవలం ఒక్క కథ మీదే తమ దృష్టిని నిలపమని ముందుగానే చెప్పారు. అలా దృష్టి పెట్టిన కథలోంచి కొన్ని ప్రశ్నలకు అడిగి చూశారు. ఫలితం! వారు ఎంతగా ప్రత్యేక దృష్టి సారించినా కూడా సదరు కథలోని చిన్న చిన్న వివరాలను సైతం వెల్లడించలేకపోయారు.

 

కార్టెక్సే కారణం

మనుషి మిగతా జీవులలాగానే అన్ని శబ్దాలనూ వింటాడు. కానీ ఆ విన్న శబ్దాలను విశ్లేషించేందుకు అతని మెదడులోని ‘కార్టెక్స్‌’ అనే భాగం మరింతగా అభివృద్ధి చెంది ఉంటుంది. ముసలివారు అవుతున్న కొద్దీ ఈ కార్టెక్స్‌ సామర్థ్యం తగ్గిపోవడాన్ని గ్రహించారు పరిశోధకులు. ఫలానా కథ మీదే దృష్టి పెట్టమని అడిగినప్పుడు, పెద్దవారిలో కార్టెక్స్‌ సహకరించకపోవడాన్ని గమనించారు. ఇదే సమస్యని యువకుల ముందు ఉంచినప్పుడు, కార్టెక్స్‌ స్పందన ఖచ్చితంగా కనిపించింది.

 

వింటారు కానీ

ఈ పరిశోధనతో పెద్దవారు మిగతావారిలాగానే వినగలిగినా, తాము విన్నదాన్ని ఠక్కున విశ్లేషించడంలో విఫలం అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా రెండుమూడు రకాల శబ్దాలు ఒకేసారి వినిపించినప్పుడు, వాటిలో ఏ శబ్దాన్ని ఎన్నుకోవాలి, ఆ శబ్దం ద్వారా ఏం గ్రహిస్తున్నాను అనే అయోమయంలోకి వారి మెదడు జారిపోతోందట. ఒకోసారి వారు ప్రశాంతమైన వాతావరణంలో వింటున్న శబ్దాలను సైతం గ్రహించలేకపోతుంటారని తేలింది.

 

నిదానంగా చెప్పాలి

పెద్దవారితో ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు రణగొణధ్వనులు లేని సందర్భాన్ని ఎంచుకోవాలి. వారితో ఏదన్నా సంభాషణ చేసేటప్పుడు టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇతర మోతలు లేకుండా చూసుకోవాలి. అన్నింటికీ మించి గట్టిగా అరవడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకోవాలి. దాని బదులుగా మనం చెప్పదల్చుకున్న విషయాన్ని నిదానంగా, స్పష్టంగా తెలియచేయాలి. అప్పుడు వినిపించడం లేదన్న వేదన వారికీ ఉండదు, చెప్పలేకపోతున్నామన్న విసుగు మనకీ కలగదు.

 

- నిర్జర.