ప్రపంచానికి పెనుభారమవుతున్న చిన్నారులు

మీ పిల్లలు బొద్దుగా.. ముద్దుగా ఉన్నారని సంబరపడి అలాగే వదిలివేయకండి.. ఎందుకంటే ఆ బొద్దుతనమే భవిష్యత్తులో మీ చిన్నారిని ఇబ్బందుల పాలుజేస్తుంది. అవును.. ఊబకాయం ప్రపంచానికి పెనుముప్పుగా మారుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు.. 19 ఏళ్లలోపు వయసు గల యువతి, యువకుల్లో ఇది తీవ్ర సమస్యగా మారింది. గత నాలుగు దశాబ్ధాల్లో మనుషులు విపరీతంగా బరువు పెరగడం పది రెట్లు పెరిగింది. గతంలో ఈ సమస్య కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లోనూ ఊబకాయుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్- ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

 

దీని ప్రకారం ఐదు నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు బాల, బాలికల్లో ఊబకాయంతో బాధపడుతున్న వారు 1975లో 1.10 కోట్ల మంది కాగా, 2016 నాటికి ఈ సంఖ్య 12.40 కోట్లకు పెరిగింది. వీరే కాకుండా అధిక బరువుతో ఉన్నవారు మరో 21.30 కోట్ల మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రాసెస్ చేసిన హై కేలరీలు, పోషకాలు కల ఆహారం అధికంగా తీసుకోవడం దానికి తోడు తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. అధిక బరువు కారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

 

చురుకుతనం తగ్గిపోవడం, నలుగురిలో కలవడానికి సిగ్గుపడటంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. మార్కెట్లో అధిక కేలరీలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ ఖర్చుకే వచ్చేస్తుండటంతో ప్రజలు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కూడా టీవీలు, కంప్యూటర్లు చూస్తూ పెరుగుతున్నారు. నేటి తరం చిన్నారుల్లో శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పిల్లలను ఇలాంటి వాతావరణం నుంచి దూరం చేసి వారికి శారీరక శ్రమ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇది ప్రపంచం ముందు అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.