కలెక్టర్ కారులో క్షతగాత్రులు

 

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో బైక్ సర్వసాధారణం అయిపోయింది. ఆ బైక్ స్టార్ట్ చేసి బయటకి వెళ్లి మళ్ళీ ఇంటికి చేరే వరకు మనం క్షేమంగా ఉంటామా లేదా అనే గ్యారెంటీ లేకుండా పోయింది. మనం సక్రమంగా  వెళ్లినా ప్రమాదం ఎదో ఒక రూపంలో పొంచి ఉంది. ఇలా మనం రోడ్డు మీద ప్రమాదాలకు గురైనప్పుడు చాలా మంది చూసి చూడనట్లే వెళ్ళిపోతారుగాని సాయం చేసే వాళ్ళు అరుదు. ఆ అరుదు వ్యక్తుల్లో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ ఒకరు. వివరాల్లోకి వెళ్తే..గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన వేమూరి రామకోటయ్య (29) ఆగిరిపల్లి నుంచి ఐదు నెలల గర్భిణీ అయినా తన భార్య వరలక్ష్మి (23), మూడేళ్ల కుమారైతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. 

మార్గమధ్యలో గొల్లనపల్లి రైస్‌ మిల్లు వద్ద నాలుగు రోడ్ల కూడలిలో అతి వేగంగా వచ్చిన మరో బైక్‌ వీరిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రామకోటయ్య, వరలక్ష్మికి తీవ్ర గాయాలు కాగా వారి కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో విజయవాడ నుంచి గన్నవరం మీదుగా నూజివీడు వెళ్తున్న సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను గమనించి తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రులను సబ్‌ కలెక్టర్‌ తన కారులోనే గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో స్పందించి క్షతగాత్రులపై సబ్‌ కలెక్టర్‌ చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు.