ఆహారమే ఆరోగ్యాన్ని రక్షించే ఆయుధం

మంచి ఆరోగ్యానికి పౌష్ఠిక విలువలున్న ఆహారం ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏమాత్రం ఒంట్లో కొంచెం నలతగా వున్నా సరైన ఆహారం తీసుకోండంటూ వైద్యులు హెచ్చరిస్తారు కూడా. ఆ అనారోగ్యాన్ని ఎదుర్కొనే ఆహార పదార్థాలని సూచిస్తారు కూడా. ఉదాహరణకి రక్తహీనతకి దానిమ్మ, ఆకుకూరలు అలాగే డయాబెటిక్‌కి మెంతులు ఇలా. సరే ఇవన్నీ మన శారీరక అనారోగ్యానికి వైద్యులు చేసే సూచనలు. కానీ, మన మానసిక ఆరోగ్యానికి, ఆహారానికి కూడా సంబంధం ఉందంటే నమ్మగలరా. ఒత్తిడిగా వున్నా,  చిరాకుగా, కోపంగా వున్నా, మూడ్ సరిగా లేకపోయినా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే అవన్నీ వాటంతట అవే సర్దుకుంటాయిట. మరి మూడ్ ఫుడ్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఎప్పుడైనా చాలా చిరాకుగా, లేదా చాలా టెన్షన్‌గా అనిపిస్తే ఒక్క అరటిపండు తినేయ్యండి వెంటనే. ఎందుకంటే, అరటిపళ్ళలో వుండే ట్రిప్టోఫాన్స్ మూడ్‌ను బాగుచేసే అతి మంచి అమినో యాసిడ్లుట. ఈ అరటిపండు తినగానే సెరోటానిక్ అనే పదార్థం విడుదలయ్యి, చికాకుని, టెన్షన్‌ని తగ్గిస్తుందిట. కాబట్టి చిరాకుగా వుంటే ఆ చిరాకుని బ్రేక్ చేసేందుకు అరటిపండుని తీసుకోవడమే తక్షణ కర్తవ్యం. ఇక ఏదైనా తీవ్ర ఆలోచనలో వుంటే, ఆ ఆలోచన క్రుంగదీస్తుంటే ఓట్స్‌ని తీసుకోవాలిట. ఈ ఓట్స్‌లో ఉండే ‘బి6’ విటమిన్ మనల్ని తిరిగి ఉత్సాహంగా ఉండేలా చేస్తుందిట.  ఇవేకాదు, ఒత్తిడిని దూరం చేసేందుకు, అలసటని, డిప్రెషన్‌ని ఎదుర్కొనేందుకు కూడా ఆహారమే ఆయుధం. ఒప్పుడైనా ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తే బంగాళాదుంపలు, చిలకడ దుంపల్ని ఆహారంలో చేర్చండి చాలు. నీర్సంగా వున్నప్పుడు వీటిని తీసుకున్నా వెంటనే శక్తి లభిస్తుంది.

-రమ