నేడే డిల్లీలో నందమూరి విగ్రహావిష్కరణ

 

ఎట్టకేలకు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరింపబడనుంది. 17ఏళ్ల క్రితం ఆయన చనిపోయిన తరువాత వచ్చిన ఈ ఆలోచన, ఇన్నేళ పోరాటం తరువాత నేటికి సాకారం అవుతోంది. విచారకరమయిన విషయం ఏమిటంటే దీనికి పైవారెవరూ అభ్యంతరాలు చెప్పనప్పటికీ, ఆయన స్వంత మనుషులే దీనికి అడ్డుతగులుతూ ఎప్పుడో జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ఇంతకాలం సాగదీసుకువచ్చారు.

 

ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఖరారు అయినప్పటికీ, దీనిపై నిన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూనే ఉండటం చాలా విచారకరం. తమకు ఆహ్వానం అందలేదంటూ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కు పిర్యాదు చేసి మరీ ఆమె చేత ఫోన్ చేయించుకొన్నాకనే చంద్రబాబు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించడం, ఆ పార్టీ తీరు ఎంత మాత్రం మారలేదని తెలియజెపుతోంది. విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదని అబద్దమాడి, స్పీకర్ నుండి అధికారికంగా ఆహ్వానింపజేసుకోవడం కోసం ఆ పార్టీ వెంపర్లాడిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది.

 

నిన్నఆపార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ‘తమ పార్టీ వ్యవస్థాపకుడయిన యన్టీఆర్ ను తమ నుండి ఎవరూ వేరు చేయలేరని’ ఆ పార్టీ నేతలు చెప్పడం గమనిస్తే, తెదేపా ఆడిన ఈ రాజకీయ నాటకం వెనుక అసలు ఉద్దేశ్యం అర్ధం అవుతుంది. యన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం కృషి చేసిన పురందేశ్వరికి ఆ ఖ్యాతి దక్కకూడదనే దుగ్ధ తెదేపా స్పష్టంగా బయట పెట్టుకొంది. తాము కాంగ్రెస్ నేత పురందేశ్వరి ఆహ్వానించినందువలన కాక, కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే ఈ కార్యక్రమంలో పాల్గొంటునట్లు గొప్పలు పోవడం వారి ఆలోచన తీరుకి అద్దం పడుతోంది.

 

తెలుగుజాతి యావత్తు గర్వించదగ్గ ఆ మహానుభావుడిని తెలుగుదేశం పార్టీ తమ సొత్తు అనుకోవడం చాలా అవివేకం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవిషయంలో తేదేపాకు బాగానే గడ్డి పెట్టిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ, యన్టీఆర్ మీద తమకే పేటెంట్ హక్కులున్నట్లు భావించడం ఆ పార్టీనేతల అహంభావానికి అద్దం పడుతోంది. ఈ విధంగా ఆఖరి నిమిషం వరకు కూడా విగ్రహావిష్కరణ అంశాన్ని రాజకీయం చేయడం వలన, ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారని స్వయంగా అంగీకరించినట్లే అవుతుంది. దాని వలన పోయేది వారి పరువే తప్ప వేరొకరిది కాదు.

 

ఇప్పటికయినా విజ్ఞత చూపి చంద్రబాబు విగ్రాహవిష్కరణ సభలో పాల్గొనడం ఆయనకు, ఆయన పార్టీకి మేలు చేస్తుంది. కానీ, మళ్ళీ ఆఖరు నిమిషంలో కొత్త ఆలోచనలు, రాజకీయాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి గౌరవం దక్కుతుంది. సినీరంగంలో, రాష్ట్ర రాజకీయాలలో తనదయిన ముద్ర వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం డిల్లీలో నెలకొల్పబడటం యావత్ తెలుగు జాతికి గర్వకారణం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇకనైనా సజావుగా సాగేందుకు నందమూరి కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు అందరూ కూడా సహకరించి, తెలుగు జాతి పరువు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఆ మహానుభావుడు విగ్రహం సాక్షిగా తెలుగువారి పరువు డిల్లీ వీధినపడటం ఖాయం.