ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చిచ్చు



ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య గిల్లి కజ్జాలకు అంతే కనబడటం లేదు. ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు రోజుకో కొత్త సమస్య సృష్టించుకొని డిల్లీలో పంచాయితీ పెట్టుకొంటూ, తెలుగు ప్రజల పరువు తీస్తున్నాయి. విద్యుత్, కృష్ణాజలాల పంపకాలు, స్థానికత, ఫీజ్ రీ-ఇంబర్స్మెంటు, ఆంద్ర వాహనాలపై పన్ను నేడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వివాదం, రేపు మరొకటి...ఎల్లుండి ఇంకొకటి...ఈ వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. 


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుండి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించగానే, దానిలో తాము పాలుపంచుకోబోమని, తెలంగాణాకు వేరేగా కౌన్సిలింగ్ నిర్వహించుకొంటామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగడాన్ని తెలంగాణా ప్రభుత్వం తప్పు పట్టింది. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణాలో ఉన్న కాలేజీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా అడ్మిషన్లు నిర్వహిస్తోందని తెలంగాణా విద్యాశాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో తెలంగాణా విద్యార్ధులు, కాలేజీలు పాలుపంచుకోవద్దని పిలుపునిచ్చారు కూడా. దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి తెలంగాణాలో స్థిరపడిన వారందరి భారం తమ ప్రభుత్వం ఎందుకు భరించాలి? అని ప్రశ్నించారు. విద్యార్ధుల స్థానికతను నిర్దేశించేందుకు తమ ప్రభుత్వం 1956సం.ను. ప్రామాణికంగా తీసుకొంది గనుక ఆ ప్రకారమే కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజ్ రీ ఇంబర్స్మెంటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందనే ఆయన ప్రశ్నకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే సమాధానం చెప్పవలసి ఉంటుంది.



 ఇక ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు కూడా చాలా ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశాలపై మరో పదేళ్ళ వరకు యదాతధ స్థితిని కొనసాగించాలని ఉంటే, తెలంగాణా ప్రభుత్వం అందుకు విరుద్దంగా స్థానికత అంశాన్ని లేవనెత్తి లక్షలాది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మంత్రి రావెల్ల కిషోర్ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఆంధ్రప్రాంత ప్రజలను, వారి పిల్లలను, తెలంగాణా ప్రభుత్వం సెకండ్ క్లాస్ సిటిజన్ల స్థాయికి దిగజార్చి వారి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేఖంగా తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. హైదరాబాద్ మరియు ఇతర జిల్లాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.



ఇరు ప్రభుత్వాల వాదనలు చాలా తర్కబద్దంగానే ఉన్నాయి. కానీ వాటి వలన సమస్య పరిష్కారం కాకపోగా మరింత గందరగోళంగా మారుతోంది. తెలంగాణా ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించడానికి తమ వద్ద సరిపోయినంత మంది అధికారులు సిబ్బంది లేనందున కౌన్సిలింగ్ వాయిదా వేయమని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషను వేసింది. కానీ తెలంగాణా మంత్రుల వాదనలు విన్నట్లయితే, ఆ విధంగా కౌన్సిలింగ్ వాయిదా కోరడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం అవుతోంది. స్థానికత ఆధారంగా ఆంద్ర, తెలంగాణా విద్యార్ధులను విభజించి కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలనే ఆలోచనతోనే గడువు కోరుతున్నట్లు అర్ధమవుతోంది.



తెలంగాణా ప్రభుత్వం తన విద్యార్థులకే ప్రయోజనం చేకూరాలని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు. ఏ ప్రభుత్వమయినా ఆ విధంగానే ఆలోచిస్తుంది. అయితే తెలంగాణాలో పుట్టి పెరిగి అక్కడే విద్యాబ్యాసం చేసిన ఆంద్ర విద్యార్ధుల బాగోగులు ఏ ప్రభుత్వం చూడాలి? అనే ప్రశ్నకు రెండు ప్రభుత్వాలు ఎదుటవారి వైపు వేలు చూపుతున్నాయి. రెండు ప్రభుత్వాలు వారి బాధ్యతను సమానంగా పంచుకోవడానికి సిద్దపడినట్లయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కానీ ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలను నడుపుతున్నతెదేపా, తెరాసల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా వాటి మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనబడటం లేదు. తత్ఫలితంగా ఆబోతుల పోరులో లేగ దూడలు నలిగిపోతున్నట్లు, ఇరు ప్రభుత్వాల మధ్య పోరులో లక్షలాది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితులు, ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఈ సమస్యలను, వివాదాలను సుప్రీంకోర్టు సైతం తీర్చలేదని అనిపిస్తోంది. అయితే ఇరు ప్రభుత్వాలు ఇదే యుద్దవైఖరి కొనసాగించినట్లయితే ఎవరూ ఊహించని అనర్ధాలకు దారి తీసినా ఆశ్చర్యం లేదు.