చంద్రబాబుకు నోటీసులివ్వద్దు.. వెనక్కి తగ్గిన టీ సర్కార్
posted on Jun 22, 2015 11:37AM

నోటుకు ఓటు కేసులో చంద్రబాబును ఇరికించాలని, పార్టీని దెబ్బగొట్టాలని తెలంగాణ ప్రభుత్వం తెగ ఉరకలు వేసింది. ఇంకేముంది స్టీఫెన్ సన్ వాంగ్మూలం రావడమే ఆలస్యం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడమే అని తెగ హడావిడి చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎందుకో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్టు వచ్చిన ఆడియో టేపులు ఇప్పటికే వాయిస్ టెస్ట్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ల్యాబ్ అధికారులు కూడా వాయిస్ టెస్ట్ కోసం చంద్రబాబుకు నోటీసులు జారీ చేద్దామనుకున్నారు.. కానీ చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం ల్యాబ్ అధికారులకు సూచించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నాంపల్లీ ఏసీబీ కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం కూడా నీరు కార్చేవిధంగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్ సన్ తనకు చంద్రబాబు డబ్బులు ఆఫర్ చేసినట్టు చెప్పగా.. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టు వచ్చిన టేపుల్లో చంద్రబాబు మాత్రం ఎక్కడ డబ్బు ప్రస్తావన తీసుకురాలేదు. దీనిని బట్టే ఈ టేపులలో ఉంది నిజం కాదని తెలుస్తోంది.. దీంతో నిన్నటి మొన్నటి వరకు చంద్రబాబుకు నోటీసులు ఇద్దామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి నోటీసులు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. మొత్తానికి ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో సయోధ్య కుదురుతుందోమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి.