ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
posted on: Feb 26, 2026 12:24PM

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో ఏ7గా ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్దమయ్యారు. ప్రస్తుతం సునీల్ బీహార్‌లో ఐజీగా పనిచేస్తున్నారు.
ఏపీ సీఐడీలో డీఐజీగా డిప్యుటేషన్‌పై పనిచేసిన సునీల్ నాయక్‌పై కేసు నమోదైన నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుని బిహార్‌కు వెళ్లిపోయారు.
తదనంతరం విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో పట్నా హైకోర్టును ఆశ్రయించి రక్షణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో సునీల్ నాయక్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని గుంటూరులోని రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
దీంతో ఆయనను అరెస్టు చేయడానికి మూడు రోజుల క్రితం దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పట్నాకు వెళ్లింది. అరెస్టు సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సునీల్ నాయక్‌ను బిహార్ పోలీసులు విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తరువాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.







