Latest News

విపక్షాల ఏకతా గీతంలో .. అనైక్యతా రాగం

posted on: Jun 16, 2022 10:26AM

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.కానీ, ఇతవరకు అటు అధికార బీజేపీ/ఎన్డీఎ కూటమి కానీ, ఇటు విపక్ష కూటమి గానీ, అభ్యర్ధులను ప్రకటించలేదు. అధికార కూటమి ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ బాధ్యతను బీజేపీ  సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించింది. ఆ ఇద్దరు నేతలు ఆ పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్య సభలో ఆపార్టీ నేత మల్లికార్జున ఖర్గేతో అదే విధంగా ఒకరిద్దరు ఇతర పార్టీల నాయకులతోనూ చర్చలు జరిపారు. అయితే, ఏకగ్రీవం అయినా కాకపోయినా, అధికార కూటమికి తమ అభ్యర్ధిని గెలిపించుకునే సంఖ్యా బలం వుంది కాబట్టి అభ్యర్ధి ఎంపిక విషయంలో తొందరపడవలసిన అవసరం  లేదని ఇటు పార్టీ వర్గాలు, అటు రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

సో ... సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు అన్నీ సరి చూసుకుని, 2024 లోక్ సభ, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలు సరిచూసుకుని తమ అభ్యర్ధిని ఖరారు చేసుకునే వెసులుబాటు అధికార కూటమికి వుందని అంటున్నారు.అందుకే, అధికార కూటమి నేతలు, ఆచి తూచి అడుగులు  వేస్తున్నారు.

కానీ, ప్రతి పక్షాల పరిస్థితి అది కాదు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధి ఎవరైనా, ఓటమికి సిద్ధమయ్యే బరిలో దిగవలసి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకటైనా, అధికార కూటమిలో, ‘ఆత్మ ప్రభోధం’ వంటి అనూహ్య పరిణామం  ఏదైనా  సంభావిస్తే తప్ప ప్రతిపక్ష అభ్యర్ధి గెలిచే అవకాశం లేదు. నిజానికి, కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీల జాతీయ  నేతల మొదలు , ప్రాంతీయ నాయకుల వరకు  అందరూ, ఆమోదిస్తూనే ఉన్నారు.  అదొకటి అలా ఉంటే, విపక్ష పార్టీలలో ఏకాభిప్రాయం అనేది, ఎండమావిగా మారిన నేపధ్యంలో, రాష్ట్రపతి ఎన్నిక విపక్షాల ఐక్యతకు  లిట్మస్ టెస్ట్’ గా మారింది. అందుకే,  అధికార కూటమితో చర్చించి, రాష్ట్రపతి ఏకగ్రీవ ఎన్నికకు విపక్షాలు అంగీకరిస్తే, విపక్షాల ఆబోరు దక్కేదని విపక్ష శిబిరంలోనే వినిపిస్తోంది. అయితే, జాతీయ రాజకీయాలపై దృష్టి  కేంద్రీకరించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ విపక్షాల ఐక్యతని చెరో వైపుకు తీసుకు పోవడంతో, ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలనే  విపక్షాల ఐక్యతా యత్నాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురయ్యాయి. 

ఈ ప్రయత్నాలో భాగంగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనీర్జీ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశం, విపక్షాల ఐక్యత కంటే, అనైక్యతను బయటకు తెచ్చిది. మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ సహా ఎనిమిది ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించారు. అయినా, ఒక్కరంటే ఒక్కరు సమావేశానికి హాజరు కాలేదు. మరోవంక ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడంపై తీవ్ర అభ్యంతరాలు తెలిపిన టీఆర్‌ఎస్‌, బీజేడీ, శిరోమణి అకాలీదళ్‌, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌  ప్రతినిధులు గైర్హాజరయ్యారు.

ఇక సమావేశానికి 17 పార్టీల ప్రతినిధులు హాజరైనా, అందులో కాంగ్రెస్, తృణమూల్ వంటి కొద్ది పార్టీలు మినహా  మిగిలిన పార్టీలు అన్నీ సింగిల్ మెంబర్ లేదా నో మెంబెర్ పార్టీలే. రాష్ట్రపతి ఎన్నికలలో ఈ పార్టీల పాత్ర నామ మాత్రంగా మాత్రమే ఉంటుంది. సరే అది ఎలా ఉన్నా, కనీసం సమావేశానికి హాజరైన పార్టీల మధ్య అయినా, ఏకాభిప్రాయం కుదిరిందా అంటే అదీ లేదు. అవును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని  ప్రతిపాదించినప్పటికీ అందుకు ఆయన నిరాకరించడంతో కథ మొదటి కొచ్చింది.

ఇక చేసేది లేక, శరద్‌ పవార్‌ను పునరాలోంచాలని ప్రతిపక్షాలు మరో మారు విజ్ఞప్తి చేశాయి. అయితే పోటీ చేసి ఒడి పోయేందుకు పవార్  సిద్ధంగా లేరని, ఎన్సీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి పవార్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో రాష్ట్రపతి రేసులో తానూ లేనని చెపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దిక్కు లేక పొతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా మమతా బెనర్జీ ఫరూక్‌ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించినట్టు ఆర్‌ఎస్పీ నేత ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ తెలిపారు. అయితే.. తొలి భేటీ ఫలవంతం కాని నేపథ్యంలో.. ఈ నెల 20-21 తేదీల్లో మరోసారి ముంబైలో శరద్‌పవార్‌ నేతృత్వంలో భేటీ అయి, ఏకాభిప్రాయానికి వస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు విశ్వాసం వ్యక్త పరుస్తున్నారు. 

అయితే, విపక్షాల మది ఏకాభిప్రాయం కుదరడం అయ్యే పని కాదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, మమతా బెనర్జీ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, అదే విధంగా ప్రాంతీయ పార్టీల స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు .. ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా విపక్షాల ఐక్యతకు ప్రతిబంధకమే అవుతాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి ఇలాంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి, కానీ, తాత్కాలికంగా సర్డుబాట్లు కుదరడమే కానీ, అంతకు మించిన ఫలితం ఇంతవరకు రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో,  దేశంలో ఉన్న  బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు అన్నీ ఒకే వేదిక మీదకు వచ్చినా, మళ్ళీ కథ మొదటికే వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...