Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మూడో ఫ్రంట్ ముచ్చటే లేదు తెరపైకి మళ్ళీ పీకే
posted on: Apr 30, 2022 5:38PM
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరుకోవు. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్. (పీకే)కూడా అంతే. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యాన్మాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆయన వెనకడుగు వేయరు. నిజానికి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీకే, ‘ఎన్నికల వ్యూహ కర్త’ అవతారం చాలిస్తున్నానని ప్రకటించారు.అలాగే, ప్రత్యక్ష రాజకీయాలకు తాను పనికి రానని, ఆయనకు ఆయనే, ‘ఐ యామే ఫెయిల్డ్ పొలిటీషియన్’ అని ప్రకటించుకున్నారు.
అయితే, ఆ తర్వాత ఆయన,ఆ విషయమే మరిచి పోయారు. ఏ పార్టీ పిలిచి బొట్టు పెట్టక పోయినా, ఆయనంతట ఆయనగానే బీజేపీ యేతర పార్టీల కూటమి ఏర్పాటు కోసం నడుం బిగించారు. మమత, శరద్ పవార్, స్టాలిన్, కేసీఆర్, ఇలా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తునే ఉన్నారు.ఈ ప్రయత్నాలలో వడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా పట్టించుకునేదే’ లే .. అంటూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వ్యూహాలను మారుస్తూ ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై చర్చలు సాగించారు. దేశంలో వారం రోజుల పాటు హల్ చల్ సృష్టించారు. అయితే, చివరకు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నుంచి వెనకడుగు వేశారు. అయినా, అక్కడితో కథ ముగిసి పోలేదు.
ఇప్పుడు మళ్ళీ పీకే బీజేపీ వ్యతిరేక కూటమి గురించి, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యాన్మాయం. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్’కు ఛాన్స్ లేదు. బీజేపీని ఓడించాలంటే, కాంగ్రెస్’తో జట్టు కట్టడం మినహా, తెరాస, తృణమూల్ వంటి ప్రాంతీయ పార్టీలకు మరో దారి లేదని తేల్చి చెప్పారు. ఒక టీవీ చానల్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారా, అన్న ప్రశ్నకు పీకే, దేశంలో మూడు, నాలుగు ఫ్రంట్లతో ప్రయోజనం లేదని, స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా గెలిచినా గెలవకున్నా, ఉనికి ఉన్న, బీజేపీ యేతర పార్టీ కాంగ్రెస్ ఒక్కటే, సో.. బీజేపీకి కాంగ్రెస్ సారధ్యంలో కూటమి మాత్రమే ప్రత్యాన్మాయం అవుతుందని, శషబిశాలు లేకుండా స్పష్టం చేశారు.
దేశంలో మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించగలదని తాను ఎప్పుడూ నమ్మలేదని, బీజేపీని మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. ఆ పార్టీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ కావాల్సిందేనని, ఏ పార్టీ అయినా బీజేపీని ఓడించాలనుకుంటే.. రెండవ ఫ్రంట్‌గా ఆవిర్భవించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సెకండ్ ఫ్రంట్‌గా భావిస్తున్నారా అని ఆయన్ను ప్రశ్నించగా.. దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ సారధ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు.
ఈ నేపధ్యంలో తెలంగాణలో బీజీపే అధికారంలోకి రాకుండా అడ్డు కునేందుకు, తెరాస, కాంగ్రెస్ తో జట్టు కట్టాలని పీకే చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకు బావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత అయినా, తెరాస, కాంగ్రెస్ జట్టు కట్టే అవకాశాలను ఇప్పటికీ కొట్టి వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా థర్డ్ ఫ్రంట్ ఆలోచను అటక ఎక్కించారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం, తెరాసతో కలిసేదే లేదని అంటున్నారు. మరో వంక బీజేపీ నాయకులు కోతికి కొబ్బరి కాయ దొరికింది అన్నట్లుగా, పీకే వ్యాఖ్యలను పట్టుకుని, తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొల్ల గొట్టేందుకు, కాంగ్రెస్, తెరాస పార్టీలు ఒకే నాణ్యానికి రెండు పక్కలని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా చాల సమయం వుంది కాబట్టి, రేపు ఏమి జరుగుతుంది అనేది, ఇప్పుడే ఉహించలేమని పరిశీలకులు అంటున్నారు. నిజం. రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును.






