TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కమిషనర్ కనిపించరు.. మంత్రి వినిపించుకోరు: తెలంగాణ కార్మిక శాఖలో సమస్యల తిష్ట

Published on: Fri May 6, 2022 1:11PM

తెలంగాణ కార్మిక శాఖ నిస్తేజంగా మారిపోయింది. ఆ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్ చార్జి కమిషనర్ గా ఉన్న నదీమ్ అహ్మద్ కనిపించరు. ఆ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వినిపించుకోరు. దీంతో ఆ శాఖలో సమస్యలు తిష్ట వేశాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై..తరువాత తెరాస గూటికి చేరిన చామకూర మల్లారెడ్డి 2018 ఎన్నికలలో తెరాస నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనతి కాలంలోనే మంత్రిగా ప్రమోషన్ పొందారు. విద్యా సంస్థల అధినేతగా ఆయన చాలా చాలా బిజీగా ఉంటారు. మంత్రి పదవి అన్నది హోదాగానే తప్ప.. ఆ శాఖపై పట్టు సాధించే దిశగా  ఇప్పటి వరకూ ఆయన ప్రయత్నించింది లేదని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ మూడేళ్లలో కార్మిక శాఖపై మంత్రి చామకూర మల్లారెడ్డి ఒక్క సారి కూడా పూర్తి స్థాయి సమీక్ష చేయలేదంటే పరిస్థితి ఏమిటన్నది ఎవరికైనా అవగతమౌతుంది.

మంత్రి ఇలా తన శాఖ పట్ల అంటీముట్టనట్టుగా ప్రవర్తిస్తుంటే.. అది చాలదన్నట్లు కార్మిక శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో.. ఇన్ చార్జ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నదీమ్ అహ్మద్ ఆదనపు బాధ్యతపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వారానికి ఒకటి రెండు సార్లు కార్యాలయానికి రావడమే గగనమంటున్నారు. దీంతో కార్మిక శాఖలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోక అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

ముఖ్యంగా 75వ షెడ్యూల్ లోని   రెండు కోట్ల మంది ఉద్యోగుల వేతన పెంపు సమస్య ఏళ్ల తరబడి పెండింగ్ లోనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి, కమిషనర్ లను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పొందిన వేతనాలే నేటికీ తమకు అందుతున్నాయనీ, ఈ ఎనిమిదేళ్లుగా పైసా జీతం పెరగలేదని వారు వాపోతున్నారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు మేలు చేసే ఉద్దేశంతోనే తమ సమస్య విషయంలో మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, మంత్రి ఆసక్తి చూపకపోవడంతో ఇన్ చార్జి కమిషనర్ కూడా పట్టించుకోవడం లేదనీ వారు ఆరోపిస్తున్నారు.  నెలల తరబడి పెండింగ్ లో ఉన్నా తమ వేతనాల ఫైలును ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్దకు పంపించలేదని అంటున్నారు. 
కనీస వేతన మండలి సిఫార్సులకు కూడా అతీగతీ లేకుండా పోయిందని కార్మికులు చెబుతున్నారు.  కార్మిక శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ ను నియమిస్తే సమస్యలు ఏదో ఒక మేరకు పరిష్కారమౌతాయని వారంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఇక మంత్రి మల్లారెడ్డి స్వయంగా విద్యా, వైద్య సంస్థలను నిర్వహిస్తున్నా..కార్మికుల సంక్షేమం ప్రయోజనాల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు.  సీఎం జోక్యం చేసుకుని కార్మిక శాఖ గాడిలో పడేలా చర్యలకు ఉపక్రమించాలనీ, మంత్రి మల్లారెడ్డి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.