చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్

 

బీజేపీతో కటిఫ్ చేసుకొని ఎన్డీయే కూటమి నుండి బయటపడిన జేడీ(యు)ని కాంగ్రెస్ పార్టీ దువ్వడం మొదలు పెట్టింది. ఆయన కోరినట్లు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని ముందే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, పనిలోపనిగా నితీష్ కుమార్ ని కూడా మంచి చేసుకొనే పనిలో పడింది. నిన్నమొన్నటి వరకూ ఎన్డీయేలో కొనసాగిన నితీష్ కుమార్ ను కూడా ఒక మతతత్వవాదిగా ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇపుడు ఆయన ఒక గొప్పలౌకికవాది అని కితాబులివ్వడం మొదలుపెటింది.

 

కానీ, ఎన్డీయే నుండి బయటకి వచ్చిన తరువాత కూడా జేడీ(యు) నేతలు బీజేపీకి అద్వానీ సారద్యం వహిస్తే తిరిగి తాము ఎన్డీయే కూటమిలోకి కొనసాగేందుకు ఆలోచిస్తామని చెప్పడంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ మళ్ళీ మనసు మార్చుకోక ముందే ఎలాగయినా తమ యుపీఏ కూటమిలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు బీహార్ శాసన సభలో బల నిరూపణకు చేయనున్నసందర్భంగా ఆయనకి అండగా నిలబడేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.

 

ఇక, ఈ రెండు పార్టీల మధ్య రాయబారాలు, బేరాలు చూసి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి కంగారు మొదలయింది. బీహార్ లో తన అధికారానికి గండి కొట్టిన జేడీ(యు) బీజేపీతో అనైతిక పొత్తులు పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెపుతూ మోసగిస్తోందని ఇంత కాలం విమర్శిస్తూ తన ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్న లాలూ, ఊహించని ఈ సరికొత్త పరిణామాలకి మరింత కంగారు పడుతున్నారు.

 

మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపినపుడే తన చేతిలోంచి బీహార్ పగ్గాలు గుంజుకొన్నతన రాజకీయ ప్రత్యర్ధి నితీష్ కుమార్, ఇప్పుడు లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే తన పరిస్థితి ఏమిటనే భయం లాలూకి పట్టుకొంది. జేడీ(యు) ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలపకుండా ఉండేందుకు ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఒక వైపు నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే మరో వైపు కాంగ్రెస్ ని మంచి చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు.

 

అయితే, లాలూ ప్రసాద్ వంటి కళంకిత వ్యక్తితో చేతులు కలపడం కంటే, బీహార్ ను అభివృద్ధిపధంలోకి నడిపిస్తున్న నితీష్ కుమార్ వంటి వ్యక్తితో చేతులు కలపడానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోంది. అలాగని లాలూని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా మున్ముందు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయనతో కూడా కాంగ్రెస్ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది.

 

నితీష్ కుమార్ మరియు అతని జేడీ(యు)పార్టీ జాతీయ రాజకీయాలలో మరియు బీహార్ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే ఉంది.