బీజేపీతో నితీష్ ఎందుకు తెగ తెంపులు చేసుకొన్నారు

 

ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు. జేడీయు ఎన్డీయేను వీడి నమ్మక ద్రోహం చేసిందంటూ బీజేపీ చేసిన విమర్శలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అంతే ధీటుగా స్పందిస్తూ, బీజేపీలో కురువృద్ధుల వంటి వాజ్ పేయి, అద్వానీలను పక్కనపెట్టి ఆ పార్టీయే నమ్మక ద్రోహం చేసిందంటూ విమర్శలు చేసారు. తమ పార్టీ పెద్దలనే గౌరవించలేని బీజేపీ ఇతరులను ఏమి గౌరవించగలదని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తమ పార్టీ ఎవరిని ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవలనేది అంతర్గత వ్యవహారమని అందులో ఇతరుల ప్రమేయం సహించబోమని ఆయన అన్నారు.

 

బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించుకోవడంతో జేడీయు బీజేపీకి దూరమయినట్లు చెపుతున్నపటికీ, నిజానికి నితీష్ కుమార్ కి కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఆశ ఉండటంతో ఆయన ఒత్తిడి వల్లనే రెండు పార్టీలు దూరం కావలసి వచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే మోడీ వంటి వ్యక్తితో కలిసి పనిచేయడం అసంభవమని వాదిస్తున్ననితీష్ కుమార్, 2003లో వాజ్ పేయితో సహా అందరూ గోద్రా అల్లర్లకు మోడీని విమర్శిస్తే, నితీష్ కుమార్ మాత్రం ఆయనను వెనకేసుకు వచ్చారు.

 

అప్పుడు నితీష్ కుమార్ కి మంచిగా కనబడిన మోడీ నేడు చెడ్డగా కనబడటానికి ప్రధాన కారణం, ఆయన ప్రధాని పదవికి తనకి పోటీగా తయారవడం వలననేనని చెప్పవచ్చును. తానూ ప్రధాని పదవికి అనర్హుడనని నితీష్ కుమారే స్వయంగా చెప్పుకొంటున్నపటికీ, ఆయనకు ఆ కోరిక ఉందనేది మాత్రం సుస్పష్టం. అయితే, నితీష్ కుమార్ ఎన్డీయేలో ఉన్నా, యుపీయేలోకి వెళ్ళినా ఎన్నడూ ప్రధాని కాలేరనే చేదు నిజం ఆయన వంటి రాజనీతిజ్ఞుడు గ్రహించకపోవడమే విశేషం. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీకే సహజంగా ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూపీఏలో రాహుల్ గాంధీకి తప్ప వేరొకరికి అవకాశం ఉండదనేది బహిరంగ రహస్యమే. అటువంటప్పుడు, ఆయన అనవసర బేషజానికి పోయి ఎన్డీయే నుండి వైదొలగడం వల్ల ఇరుపార్టీలు నష్టపోవడం తప్ప ఎవరికీ ఒరిగేదేమీ ఉండదు.

 

ఈ విషయం ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కి కూడా స్పష్టంగా అర్ధమయినప్పటికీ, బీహార్ రాష్ట్రంలో జేడీ(యు)ను అధికారంలోకి తీసుకువచ్చిన నితీష్ కుమార్ ను కాదనలేని నిస్సహాయ స్థితి ఆయనది. జేడీయులో నితీష్ కుమార్ మాటే వేదంగా చెలామణి అవుతోంది గనుకనే బీజేపీతో తెగతెంపులు చేసుకోవలసి వచ్చింది.