బీజేపీ ఆశలపై నితీష్ ఎఫెక్ట్... 2024 ఎన్నికలు అంత వీజీ కాదు

బీహార్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా బీజేపీపై పడిందా? నిన్న మొన్నటి దాకా తిరుగులేని పార్టీగా, 2024 ఎన్నికలలో ఒంటరిగా బీజేపీకే 300కు పైగా స్థానాలు వస్తాయంటూ అన్ని సర్వేలూ వెల్లడించిన పరిస్థితి మారిపోయిందా? అంటే తాజాగా వెలువడిన సీ ఒటర్ సర్వే ఔననే అంటోంది. నితీష్ ఎపిసోడ్ తరువాత బీజేపీ బలం గణనీయంగా తగ్గిందని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సీ ఓటర్ సర్వే పేర్కొంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కనీసంలో కనీసం 21 సీట్ల తక్కువ వస్తాయని సర్వే వెల్లడించింది. ఆగస్టు 1కి ముందు నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని పేర్కొన్న ఆ సర్వే నితీష్ ఎపిసోడ్ తరువాత మాత్రం ఆ సంఖ్య 289కి పరిమితం అవుతుందని తేల్చింది.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు లభించినప్పటికీ మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. భారీ విజయంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సాధారణ విజయంతో సరిపెట్టుకోవలసి వస్తుందని ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వే అనంతరం విశ్లేషకులు రానున్న రోజులలో బీజేపీ బలం మరింత తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

ఒక్కటొక్కిగా మిత్ర పక్షాలు చేజారిపోతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ బలహీనతలు మరింత ప్రస్ఫుటంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించకుంటే.. ఆ పార్టీ ఇక తెలంగాణపై ఆశ వదిలేసుకోవలసిందేనని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu