నిర్భయ కేసులో దోషులను నిర్దారించిన కోర్టు

 

గత ఏడాది డిశంబర్ 16న డిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసుపై విచారణ జరుపుతున్నడిల్లీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ టాకూర్, ముకేష్ సింగ్ మరియు పవన్ గుప్తాలను ఈ రోజు దోషులుగా నిర్దారించింది. వారికి రేపు శిక్షలు ఖరారు అయ్యే అవకాశముంది. కొత్తగా అమలులోకి వచ్చిన నిర్భయ చట్టం ప్రకారం వారికి మరణ శిక్ష లేదా యావత్ జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. నిందితులలోఒకడయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ కొన్ని నెలల క్రితం తీహారు జైలులో ఆత్మహత్య చేసుకొన్నాడు. మరో బాల నేరస్తుడికి బాల నేరస్తుల చట్టం ప్రకారం ఇటీవలే మూడేళ్ళ జైలు శిక్ష విధించబడింది.

 

ఒకవేళ రేపు కోర్టు వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటిస్తే, ఆ నలుగురు నేరస్తులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడం ద్వారా మరింత సమయం పొందవచ్చును. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా వారికి అవే శిక్షలు ఖరారు చేసినట్లయితే, ఆ తరువాత రాష్ట్రపతి దయాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా మరికొంత సమయం పొందవచ్చును. బహుశః ఈ ప్రక్రియ అంత ముగిసేసరికి మరో ఏడాది, రెండేళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు.