భారత్ లో భారీ విధ్వంసానికి కుట్ర... 9 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

మనదేశంలో విధ్వంసానికి పథకం రచించిన ఉగ్రవాదుల కుట్ర మరోసారి భగ్నమైంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. అల్ ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు నిఘా వర్గాల ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కి సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారంతో ఈరోజు ఉదయం కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు చేసి 9 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎర్నాకుళంలో ముర్షద్ హసన్, ముషారఫ్ హుసేన్ ఇయాకుబ్ బిశ్వాస్ ‌తో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబు సూఫియాన్, నజ్ముస్ షకీబ్, మైనుల్ మోండల్, అల్ మమున్ కమల్, లీ యీన్ అహ్మద్, అతితుర్ రెహమాన్ ఉన్నారు. వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, శరీర రక్షణ కవచాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది.

 

అరెస్టు అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీరిలో కొందరు ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని. అక్కడ తుపాకులు, బాంబుల తయారీకి వాడే ముడి పదార్థాలు, ఇతర ఆయుధాలను సేకరించాలని వారు భావించినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ, ఎన్‌సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఈ అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.