ఫేక్ న్యూస్ పై కొత్త చట్టం కాదు.. కొత్త సిస్టం తేవాలి!?
posted on Sep 5, 2025 12:26PM

ఫేక్ న్యూస్ మీద చంద్రబాబు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం నిర్వహిస్తోంది. ఇది కరెక్టు కాదు తప్పు.. ఫేక్ కాదు రియల్ అంటూ మనం వాళ్లకు ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలా? లేక పని చేయాలా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సుగాలీ ప్రీతికి మద్దతుగా నిలిచినందుకు తనను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు సీబీఐకి అప్పగించినట్టు గుర్తు చేశారు చంద్రబాబు. ఈ విషయంపై అధికారులు సైతం స్పందించాల్సి ఉందని.. వీరి నుంచి సరైన స్పందన లేక పోవడం వల్ల కూడా జనం పెద్ద ఎత్తున కన్ ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు.
ఇటీవలి కేబినేట్ భేటీ అనంతరం మంత్రులతో మాట్లాడిన బాబు.. ఈ విషయంపై విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఫేక్ న్యూస్ ని అరి కట్టడానికి ఒక కొత్త చట్టం తేవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అంతే కాదు ఈ విషయంపై ఒక మంత్రి వర్గ ఉపసంఘం సైతం ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఈ సబ్ కమిటీలో మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్ధసారధి ఉన్నారు. వీరి ఆలోచన ఏంటంటే ఇకపై సోషల్ మీడియాకు ఆధార్ లింకయ్యేలా ఒక అకౌంటబిలిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వార్ని వెంటనే పట్టుకుని కట్టడి చేసేలా ఈ కొత్త చట్టం రానుంది. ఈ దిశగా కొన్ని నిబంధనలతో కూడిన కార్యాచరణ రూపొందించనుంది మంత్రివర్గ ఉపసంఘం.
అయితే ఇలాంటి చట్టాలు చాలానే వస్తుంటాయ్. పోతుంటాయ్. ఇందుకంటూ నాన్ స్టాప్ గా పని చేసే సిస్టమ్ ఒకటి ఇంప్రూవ్ చేయాల్సి ఉందని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఉదాహరణకు ఒక యాప్ తయారు చేసి అందులో ఒక వార్త నిజమా కాదాని టెస్ట్ చేసుకోవడం. ఆపై ఒక యూట్యూబ్ చానెల్ నిర్వహించి.. తద్వారా ఈ ఫేక్ న్యూస్ ఎప్పటికప్పుడు తప్పు అంటూ ప్రెజంటేషన్లు ఇవ్వడం వంటివి చేయాల్సి ఉందని అంటున్నారు వీరంతా. ఇప్పుడు చూడండి ఇదే చంద్రబాబు పై జగన్ ఒక ఉల్లి బాంబు విసిరేశారు. ఉల్లి రైతులకు ఇక్కడ గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఆయన హెరిటేజ్ లో మాత్రం కిలో 35 రూపాయలకు అమ్ముతున్నట్టు ఆరోపించారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. అసలు హెరిటేజ్ కి రీటైల్ అవుట్ లెట్స్ లేవంటుంటే.. మధ్యలో ఈ కిలో బేరాలు ఎక్కడివని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఇక కుప్పంకి కృష్ణమ్మ నీళ్ల వ్యవహారం. ఈ విషయంలోనూ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు.. పెద్ద ఎత్తున దుమారం చెలరేగేలా చేస్తున్నాయి. ఆ నీళ్లు కృష్ణ నీళ్లు కావని.. ట్యాంకర్లలో తోలినవని సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రోలవుతోంది. ఇలాంటి విషయాలపై కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావల్సి ఉంది. ఎవరైనా ఔట్ సోర్సింగ్ కి కానీ, లేదంటే స్వయంగా ఐ అండ్ పీఆర్ ద్వారా గానీ ఒక యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని రెడీ చేసి దాని ద్వారా ఈ ఫేక్ న్యూస్ పై ఫైట్ చేయాల్సి ఉంది.
ఇప్పటికే ఏపీడీసీ, ఆపై ఇతర సోషల్ మీడియా వింగుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది నియామకాలు జరిగాయి. కానీ ఫేక్ న్యూస్ మీద ఈ స్థాయిలో ఒక వ్యవస్థ ఏర్పాటైతే లేదు. కేవలం చట్టం తయారు చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఖచ్చితంగా ఇందుకంటూ ఒక సిస్టమ్ ఉండి తీరాల్సిన అవశ్యకత అయితే కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు సోషల్ మీడియా వ్యవహారాల నిపుణులు. ప్రస్తుతం కేబినేట్ భేటీ ముగిశాక.. అందరూ కలసి నిర్ణయించింది ఏంటంటే, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరిపై విమర్శలు వచ్చినా మూకుమ్మడిగా ఒక్కటై.. ఈ దాడులను తిప్పి కొట్టాలని. ఉదాహరణకు రాహుల్, మోడీ తల్లిపై చేసిన కామెంట్ల లాంటి వాటిని అస్సలు ఉపేక్షించరాదని వీరంతా నిర్ణయించారు.
కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే.. నిజం ఒక అడుగు వేసే లోపల, అబద్ధం వందడుగులు వేసేస్తోంది. ఈ విషయంపైనా మంత్రి వర్గం మొత్తం సీరియస్ గా చర్చించింది. మనం రియాక్ట్ అయ్యే లోపల అబద్ధాన్ని నిజమన్నంత గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారని అందరూ కలసి ఆవేదన వ్యక్తం చేశారు. మన పనిలో మనం ఉంటే- వారి పనిలో వారుంటున్నారనీ వీరంతా అభిప్రాయ పడ్డారు. కానీ, ఇక్కడ ఇందుకంటూ ఒక వ్యవస్త లేక పోవడమే అసలు సమస్యగా కనిపిస్తోంది. సోషల్ మీడియా దుష్రచారాన్ని ఢీ కొట్టడానికి యాంటీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూటమి శ్రేణులు రివర్స్ అటాక్ చేయడానికంటూ ఒక వ్యవస్థ లేక పోతే.. వచ్చే రోజుల్లో చాలా చాలా కష్టమన్నది నిపుణుల మాట. మరి చూడాలి.. కూటమి ఈ దిశగా ఏదైనా కొత్త చట్టంతో పాటు, మరేదైనా కొత్త సిస్టమ్ తయారు చేయాలన్న ఆలోచన చేస్తుందా లేదా?