సూపర్ ఫాస్ట్ రోబో వచ్చేసింది

 

అమెరికన్ రోబోటిక్ శాస్త్రవేత్తలు వెరైటీ రోబోలను తయారుచేయడంలో ముందంజలో ఉన్నారు. వాళ్లు ఈసారి రెండుకాళ్లతో అత్యంత వేగంగా పరిగెత్తే రోబోను అభివృద్ధిపరిచారు. అయితే ఇందుకు ముందే రోబోలు ఉన్నా... వాటికి ధీటుగా అన్నింటికన్నా వేగంగా పరిగెత్తగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ఏట్రియాన్ అనే పేరు పెట్టారు. రెండు కాళ్లతో వేగంగా దూసుకెళ్లగలిగే పక్షుల శరీర నిర్మాణం ఆధారంగా ఈ రోబోను రూపొందించినట్లు పరిశోధనలో పాల్గొన్న జొనాథన్ హర్ట్స్ తెలిపారు. మార్గమధ్యంలో ఎలాంటి ఎగుడుదిగుళ్లు ఉన్నా కూడా కింద పడిపోకుండా పరిగెత్తే సామర్ధ్యం ఈ రోబోకు ఉందన్నారు. అంతే కాకుండా ఏదైనా ప్రమాదం సంభవించినపుడు అక్కడికి సహాయక సిబ్బంది వెళ్లడం సాధ్యం కానప్పుడు ఈ రోబోను పంపించి తగు చర్యలు చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ రోబోను ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ కళాశాల నిపుణులు 'రక్షణ ఆధునిక పరిశోధన ప్రాజెక్టుల సంస్థ', 'మానవ శాస్త్రపరిజ్ఞాన పథకం' ఆర్ధికసాయంతో తయారుచేశారు.