రాజధాని గుంటూరు వద్దే కానీ...

 

మొదట విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లున్నారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయదలిస్తే అవసరమయిన భూమి సేకరించడానికే దాదాపు రూ. 20-25,000 కోట్లు అవసరం ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అంతేకాక ఇదివరకు కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ ఘర్, ఉత్తరాఖండ్, జార్ ఖండ్ రాష్ట్రాలు రాజధాని నిర్మించుకోవడానికే కేంద్రం అరకొర నిధులు విదిలించిందని, కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం వేలు,లక్షల కోట్లు కుమ్మరిస్తుందని ఆశపడటం అత్యాసే అవుతుందని కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోపదేశం చేసిన తరువాత నుండి దాని ఆలోచనలో మార్పు కనబడుతోంది.

 

తెదేపా అధికారం చెప్పట్టగానే ఎవరినీ సంప్రదించకుండానే రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు త్వరలోనే దీనిపై అఖిలపక్ష సమావేశం, ఇంకా అవసరమయితే శాసనసభలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయలు తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల తనను కలిసిన లెఫ్ట్ పార్టీ నేతల ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయం కేవలం నాయకుడు ఒక్కడే నిర్ణయించలేడు, అందరి అభిప్రాయం మేరకు తగిన నిర్ణయం తీసుకొంటామని జవాబు చెప్పడం గమనిస్తే ఆ మార్పు స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఆయన ఈ పని ముందే చేసి ఉండి ఉంటే విమర్శలు ఎదుర్కొనే ఇబ్బంది తప్పేది.  

అయితే రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో శివరామ కృష్ణన్ కమిటీ కూడా అంగీకరించింది కనుక విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తోంది. అయితే దానికి ఇప్పుడు సమన్యాయం, సమదూరం అనే కొన్ని సవరణలను జోడిస్తోంది. అక్కడ రాజధాని నిర్మించినట్లయితే అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంటుందని, గనులు, దేవాదాయ, చేనేత, మత్స్య తదితర ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను, సంబంధిత జిల్లాలలోనే నెలకొల్పినట్లయితే అన్ని జిల్లాలకు సమన్యాయం చేసినట్లు ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వంలో వివిధ శాఖలకు చెందిన దాదాపు 900 కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యమయినవి తప్ప మిగిలిన అన్నిటినీ వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలో గణనీయమయిన ఈ మార్పు చాలా అభినందనీయమే.

రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఉంచి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసినట్లయితే, ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉండదు. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని కోసం మొదలయిన ఉద్యమాలు కూడా చల్లబడుతాయి. అప్పుడు రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు సేకరించే అవసరము తప్పుతుంది. ప్రస్తుతం తక్కువ పరిధిలో రాజధాని నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొనట్లయితే, కేంద్రం ఇచ్చే నిధులతోనే నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టవచ్చును. ఆ తరువాత అవసరమనుకొంటే రాజధానిని కొద్ది కొద్దిగా విస్తరించుకోవచ్చును. ముందు అనుకొన్నట్లుగా రాజధానిని 20-25,000 ఎకరాలలో నిర్మించినట్లయితే దానంతటికీ అవసరమయిన నీటి సరఫరా కూడా కష్టమే అవుతుంది. అదే రాజదానిని చిన్నదిగా నిర్మించుకొన్నట్లయితే నీటి కొరతను కూడా అధిగమించవచ్చును.

ఏమయినప్పటికీ రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ తుది నివేదిక ఇచ్చిన తరువాతనే దానిపై తుది నిర్ణయం తీసుకొంటామని మంత్రి నారాయణ చెప్పారు.