టై కట్టుకుంటే గుండెపోటు వస్తుందా!

 

కొన్ని అలవాట్లు ఎందుకు ఎలా మొదలవుతాయో తెలియదు... కానీ మనం వాటిని పాటించేస్తూ ఉంటాం అంతే! టై కట్టుకునే అలవాటు కూడా ఇంతే! ఎప్పుడో సైనికులు తాము ఏ రాజ్యానికి చెందినవారో చెప్పుకోవడానికి టై కట్టుకునేవాళ్లంట.... అదే ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఏదన్నా ఇంటర్వ్యూ, సెమినార్‌లాంటి చోట్లకి వెళ్లాలంటే ఇప్పుడు టై కంపల్సరీ. ఆఫీసరు పోస్టులో కాస్త హుందాగా ఉండాలన్నా టై ఉండి తీరాల్సిందే! టై వల్ల లాభం ఉందో లేదో తెలియదు కానీ... నష్టాలు మాత్రం ఉండి తీరతాయంటున్నారు పరిశోధకులు...


జర్మనీకి చెందిన కొంతమంది పరిశోధకులు టై బిగించి కట్టుకోవడం వల్ల మెదడుకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం వాళ్లు ఓ 30 మందిని ఎంపిక చేసుకున్నారు. వీళ్లంతా 30 ఏళ్లలోపు ఉన్న ఆరోగ్యవంతులైన యువకులే. వీళ్లని రెండు గ్రూపులుగా విడదీశారు. మొదటి గ్రూపులో వాళ్లకి టై కట్టి, MRI స్కాన్‌ తీశారు. ఈ స్కాన్‌లో దిమ్మతిరిగే ఫలితాలు కనిపించాయి.

 


చొక్కా పై గుండీ పెట్టుకుని, టై కాస్త బిగుతుగా కట్టుకున్నవాళ్లలో మెదడుకి చేరే రక్తప్రసారం పదిశాతం వరకూ తగ్గిపోయిందట. టైని కాస్త వదులు చేసిన తర్వాత కూడా ఓ పట్టాన రక్తప్రసారం సరికాలేదట! టై కట్టుకోని వాళ్ల MRI స్కాన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మెదడుకి ఏకంగా పదిశాతం రక్తప్రసారం తగ్గిపోవడం అంటే మాటలు కాదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ బీపీ, షుగర్, గుండెజబ్బులు, ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇదేమంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


టై కట్టుకోవడం వల్ల పైన చెప్పుకొన్న సమస్యే కాదు... ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. టై బిగించి కట్టుకోవడం వల్ల కనుగుడ్ల మీద ప్రెషర్ పెరిగిపోతుందట. ఇది గ్లూకోమాలాంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదండోయ్‌... టైతో ఇంకో చిత్రమైన ప్రమాదం ఉంది. టైని మనం రోజూ ఉతుక్కో కదా! దానివల్ల అవి నానారకాల వైరస్‌, బ్యాక్టీరియాలతో నిండిపోతాయి. దానివల్ల దారినపోయే జబ్బులన్నీ మనకి చేరడానికీ, మన నుంచి అవతలివాళ్లకి రోగాలు అంటించడానికీ మాత్రమే ఉపయోగపడతాయి.

- నిర్జర.