TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణంరాజుపై తక్షణ చర్యలకు ఎన్‌సీడబ్ల్యూ అదేశాలు

Published on: Wed Jun 11, 2025 3:11PM

జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. కృష్ణంరాజు అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ఈ విషయంపై వేగంగా, నిర్దుష్ట కాలపరిమితిలోపు దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు విజయ రహాట్కర్‌ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. మూడు రోజుల్లోపు దీనిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

 ఇప్పటికే కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ అయోధ్యనగర్‌లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందనీ.. కుటుంబసభ్యులు కూడా లేరని సమాచారం. కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు డీఎస్పీ సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికలను పసిగట్టే పనిలో ఉన్నారు. విజయవాడ నుంచి ఎక్కడికి, ఎప్పుడు వెళ్లారనే విషయాలను నిఘా పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం పరారీలో ఉన్న వీవీఆర్‌ కృష్ణంరాజు జర్నలిస్ట్‌ అనే ఆంగ్ల మాసపత్రికకు ఎడిటర్‌గా చెలామణి అవుతున్నారు. జర్నలిస్ట్‌ పత్రిక పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రెడిటేషన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి తానో సుద్దపూసనని ప్రచారం చేసుకుంటారు. ఏపీ టీవీ జర్నలిస్ట్‌ అనే మల్టీమీడియా న్యూస్‌ ఏజెన్సీకి  స్వయం ప్రకటిత సీఈవో గా ఉన్నారు.  బెజవాడ ప్రెస్‌క్లబ్‌ అంటూ హడావుడి చేశారు. గది అద్దెకు తీసుకుని కార్యాలయం కూడా ప్రారంభించారు. అయితే అటువైపు ఎవరూ చూడకపోవడంతో  అద్దె దండుగ అంటూ  దానిని మూసేశారు. 

కొమ్మినేని శ్రీనివాసరావుకు, కృష్ణంరాజుకు పూర్వాశ్రమం నుంచి మైత్రీబంధం ఉంది. కొమ్మినేని చొరవతోనే జగన్ మీడియా చానెల్  డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని  2014-19 మధ్య రాజధాని అమరావతితో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విషం కక్కారు. మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. 2014-19 మధ్య... ఆయనే పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు.  కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా  జగన్ మీడియా హైలైట్ చేస్తుంది. అలా జగన్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన  పేపర్‌ క్లిప్పింగ్‌లన్నీ కృష్ణంరాజు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో  ఉంచుకున్నారు. తరచూ తనకు సాక్షి డిబేట్‌లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు... తన జర్నలిస్ట్‌ పత్రిక పదో వార్షిక సంచిక ముఖచిత్రంపై  కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటో వేసి, జర్నలిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అంటూ మిత్రబంధం చాటుకున్నారు.