దిల్లీలో జంగిల్ రాజ్ నడుస్తోంది- నితీశ్
posted on Feb 24, 2016 11:31AM
.jpg)
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని భూతద్దంలో చూపించి, జంగిల్ రాజ్ అంటూ ఉంటారు. కానీ నిజానికి జంగిల్ రాజ్ అంతా దిల్లీలోనే నడుస్తోంది’ అంటూ విరుచుకుపడిపోయారు. ‘దిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేస్తూ ఉంటారు. కోర్టులో ఉన్న కన్నయా కుమార్ మీద దాడి జరిగినప్పుడు వాళ్లంతా కిమ్మనకుండా ఉండిపోయారంటే తప్పు ఎవరిది’ అంటూ చెలరేగిపోయారు నితీశ్.
నితీశ్‌గారు అక్కడితో ఆగలేదు ‘దేశంలో ఆర్ధిక సంస్కరణలు విజయవంతం కాలేదు. మేక్ ఇన్ ఇండియా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారీ పెట్టుబడులు ఏవీ రావడం లేదు. కొత్తగా ఉద్యోగాలనీ కల్పించలేదు. వీటన్నింటి నుంచీ దృష్టి మళ్లించేందుకు RSS, BJPలు ఇలాంటి వివాదాలని పెంచి పెద్దవి చేస్తున్నాయి’ అంటున్నారు. మరి కన్నయా కుమార్ చేసిన పనిని మీరు సమర్థిస్తారా అని అడిగితే... ‘దేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా నినాదాలు చేస్తే వారిని తప్పకుండా శిక్షించాల్సిందే! కానీ కన్నయా కుమార్ అలాంటి నినాదాలు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు’ అని బదులు చెప్పారు. నితీశ్ మాటలకు భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!