బీజేపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిపై చర్యలు: మోడీ

 

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నిన్న ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్ట మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, ఆ చర్యలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డితో కూడా కటినంగానే వ్యవహరిస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక తమ ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయిన సీట్లను తప్పక సాధిస్తుందని, అందువల్ల వైకాపా మద్దతు తీసుకోబోమని, ఆపార్టీని దూరంగా ఉంచుతామని అన్నారు. ఇంతకు ముందు మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన వైకాపా మద్దతు తమకు అవసరం లేదని ప్రకటించడం చూస్తే, బహుశః ఆయన చెపుతున్నట్లు తమ పార్టీ గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారని అర్ధమవుతోంది. ఇటీవల వెలువడిన తాజా సర్వే నివేదికలు కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమయిన ఆధిక్యత రావచ్చని సూచిస్తున్నాయి. బహుశః అందుకే మోడీ తమకు వైకాపా మద్దతు అవసరం లేదని అనగలిగారు. అందువలన జగన్మోహన్ రెడ్డి కూడా ఇకపై కాంగ్రెస్ లేదా అది మద్దతు ఇచ్చే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చి కేంద్రంలో మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చును. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి రానున్న నరేంద్ర మోడీ, తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిపై మరింత ఘాటుగా విమర్శలు, హెచ్చరికలు చేయవచ్చునని ఆయన మాటలు సూచిస్తున్నాయి. ఇది బీజేపీతో పొత్తులు పెట్టుకొన్న తెదేపాకు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి మరింత ఉత్సాహం కలిగించవచ్చును. మోడీ తన ఎన్నికల ప్రచారం వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పోటీ చేస్తున్న వైజాగ్ నుండే మొదలుపెట్టే అవకాశం ఉంది గనుక, అది ఆమె విజయావకాశాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.